ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి ఏమార్చడం ఏమిటి…మరీ విడ్డూరం కాకపోతే అని కొట్టి పడేయొద్దు. ఎందుకంటే వైకాపా ఎమ్మెల్యేల వలసలు జోరందుకొన్న ప్రతీసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వ్యూహం అమలుచేయడం, ఆ మాయలో చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ కొన్నిరోజులు కొట్టుకుపోవడం చూస్తుంటే అది నిజమని అర్ధమవుతుంది.
జగన్మోహన్ రెడ్డిని ఏవిధంగా రెచ్చగొట్టాలో తెదేపా నేతలు పసికట్టినట్లే, చంద్రబాబు నాయుడుని, తెదేపా నేతలందరినీ ఏవిధంగా పక్కదారి పట్టించవచ్చో జగన్మోహన్ రెడ్డి కూడా కనిపెట్టినట్లే ఉన్నారు. మొదటిసారి వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జోరందుకొన్నప్పుడు జగన్ డిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి అక్కడ టాంటాం చేసి వచ్చారు. అప్పుడు తెదేపా నేతలు అందరూ జగన్ పై, కేంద్రమంత్రులపై ఫైర్ అవడం, అప్పుడు రాష్ట్ర భాజపా నేతలు తెదేపాని, తెదేపా నేతలు భాజపా నేతలని విమర్శించుకోవడంతో అందరూ బిజీ అయిపోయారు. అప్పుడు వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులకి కొన్ని రోజులు బ్రేక్ పడటం అందరూ చూశారు.
ఆ తరువాత వైకాపా ఎమ్మెల్యేలపై తెదేపా మళ్ళీ దృష్టి పెట్టినప్పుడు జగన్ తెలంగాణా ప్రాజెక్టుల అంశాన్ని కెలికి వదిలిపెట్టారు. అప్పుడు తెదేపా, తెరాస నేతలు, రెండు ప్రభుత్వాలు కీచులాడుకొన్నాయి. అప్పుడు కూడా కొన్ని రోజులు వైకాపా ఎమ్మెల్యేల వలసలకి బ్రేక్ పడింది. ఆ తరువాత రైతు భరోసా యాత్రలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఫిరాయింపుల సంగతి పక్కన బెట్టి, తెదేపా నేతలందరూ జగన్ పై తమ దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని తెదేపా ముందుంచారు. తెదేపా ఆయనతో పట్లు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ముద్రగడని ముందుంచుకొని జగన్మోహన్ రెడ్డే వెనుక నుంచి కధ నడిపిస్తున్నారని తెదేపా నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు. ఆ విషయం వారికీ అర్ధమైనప్పటికీ జగన్ విసిరిన గాలానికి చిక్కుకొని దాని నుంచి తప్పించుకోలేక విలవిలలాడుతుండటం విశేషం. వైకాపా ఎమ్మెల్యేలపై తెదేపా దృష్టి సారించిన ప్రతీసారి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఏదో ఒక ఉపాయంతో తెదేపా నేతల దృష్టిని వేరే అంశం మీదకి మళ్ళించడం, వాళ్ళు ఆ మాయలో పడి సతమతమవడం నిత్యకృత్యమైపోయిందిప్పుడు.
ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష వ్యవహారం నేడోరేపో ముగుస్తుంది. కనుక తరువాత తెదేపా కోసం జగన్ ఏమి సిద్దం చేస్తున్నారో చూడాల్సిందే!