తిరుపతిలో మునికోటి అనే యువకుడు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన అందర్నీ కదిలించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ అతగాడు బలిదానానికి యత్నించిన ఘటన హృదయవిదారకం. అందుకే దాదాపు అన్నిపార్టీల నేతల నుంచి ఉవ్వెత్తున స్పందన వచ్చింది. మీడియాకూడా ఈ సంఘటనకు అధిక ప్రాధాన్యతనే ఇచ్చింది. అయితే ఈరెండింటి స్పందనలోని లోగుట్టు తెలుసుకోవాల్సిఉంది.
రాజకీయ `మంటలు’
ఇక రెండవ విషయం- మంటల చుట్టూ చేరిన రాజకీయ ఈగలకు సంబంధించినది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలన్న డిమాండ్ ని ఎవ్వరూ తప్పుపట్టలేరు. అలాగే అందుకోసం పోరాటంచేయడమూ తప్పుకాదు. కాకపోతే పోరాటం చేసేవాళ్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం లేదా చేయించడం వల్ల ఆవేశం కట్టలుతెంచుకుని ఇలాంటి సంఘటనలకు దారితీయవచ్చు. తెలంగాణపోరాటసమయంలోనూ ఇదే జరిగింది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకోవడం వెనుక స్వార్థరాజకీయ శక్తుల ప్రమేయం లేదని అనలేం. మంటల ఎగిసిపడగానే దాదాపు అన్ని పార్టీల వాళ్లు యథాశక్తిన రెచ్చిపోయారు. ఒక పక్క శాంతిమంత్రాలు వల్లిస్తూనే మరోపక్క రెచ్చగొట్టే మాటలు విసురుతున్నారు. ఎవరి చేతకానితనం వల్ల ఈ సంఘటన జరిగిందన్నది చర్చకాదు. ఎవరు బాధ్యత వహించాలన్నదీ ప్రశ్నకాదు. ఆత్మహత్యలకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వారి ప్రయోజనాలేమిటో ప్రజలు అర్థంచేసుకోవాలి. ఒకరిపై మరొకరు బురదజల్లుకోవడానికి ఈ సంఘటన ఉపయోగపడింది. ఆ రకంగా రాజకీయ ప్రయోజనం ఎంతోకొంత ప్రతిపార్టీ దక్కించుకోగలిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? ఈ రాజకీయ ఈగలు ఇలాగే మంటలచుట్టూ తిరుగుతుంటే రేపు రాబోయే కాలంలో మరెంత ఉపద్రవం ముంచుకువస్తుందోనన్నభయం వెంటాడుతోంది.
టీవీ పెడుతున్న `చిచ్చు’
`మంటల’ చుట్టూ జరిగినసంఘటనల్లోని అసలు కథ తెలుసుకోవాలి. ముందుగా, మీడియా కవరేజ్ చూద్దాం. సంఘటన దారుణమైనదే. ఉన్నట్టుండి యువకుడు ఆవేశపడిపోయి ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే పక్కనున్నవాళ్లు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ దృశ్యాలను టివీల్లో వార్తా ప్రాధాన్యాన్నిబట్టి ఒకటిరెండు సార్లు చూపితే చాలు. కానీ మన టీవీలవాళ్లు అత్యుత్హాం ప్రదర్శించారనే చెప్పాలి. సంఘటన జరిగినప్పటి నుంచి పదేపదే ఆ మంటల దృశ్యాలను చూపించి హడలెత్తించారు. నిజానికి ఇది అవసరమా? టీవీ ఛానెళ్లు తమ రేటింగ్ ల కోసమో, లేక పోటీకోసమో, కాకుంటే తమ పొలిటకల్ మైలేజీకోసమో కొన్ని సంఘటనలను ఎలివేట్ చేస్తుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. ప్రమాదాలు, హత్యసంఘటనలు, అత్యాచార బాధితులకు సంబంధించిన దృశ్యాలు వంటివి టీవీల్లో చూపించేముందు జాగ్రత్తలు పాటించాలన్న మార్గదర్శకాన్ని తెలుగు ఛానెళ్లు తుంగలో చుట్టేస్తున్నాయి. రక్తసిక్తమైన శరీరాలను, మంటల్లో కాలిపోయిన శరీరాలను చూపించడమంటే కొన్ని టీవీలకు మహాసరదాలాఉంది. కాకపోతే బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తే తమకు ఎలాంటి ఇబ్బందిలేదనుకుంటున్నారు. గతంలో ఒక ఫ్యాక్షనిస్ట్ జైల్లో హత్యకు గురైతే, అతని శరీరాన్ని ఒక ఛానెల్ వాళ్లు చాలా దగ్గరగా (ఎంత దగ్గరగా అంటే, డెడ్ బాడీమీద ఈగలు కూడా కనిపించేటంతగా) పదేపదే చూపించారు. అలాగే ఇంకో టివీ వరదలు పోటెత్తున్నప్పుడు ఫలానా ఊరు మరికాసేపట్లో మునిగిపోతుందని ఊదరగొట్టారు. తీరా అలాంటిదేమీలేదు. అలాగే, ఇంకోసారి, లేని భూకంపాన్ని వార్తల్లో చూపించి ప్రజలను భయభ్రాంతులను చేశారు.
టివీ మాద్యమం ఉన్నది దేనికి? అందునా, న్యూస్ ఛానెళ్లు ఉన్నది దేనికి? వార్తను వార్తగా ఇవ్వకుండా వాటిలో రేటింగ్ లు ఏరుకునే దౌర్భాగ్యస్థితిలో ఉన్నాయి ఈ చానెళ్లు. ఇవ్వాళ్ఠి మంటల సీను చూశాక కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరంఉందేమోననిపిస్తోంది.
– కణ్వస