ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో టచ్చింగ్లో ఉండే దాసరి నారాయణరావు ఈసారి పద్మశ్రీ అవార్డులిచ్చే వైఖరిపై మండిపడ్డారు. ముక్కు మొహం తెలియనివాళ్లకు అవార్డులిచ్చేస్తున్నారని, ఇదో రికమెండేషన్ల రాజ్యం అయిపోయిందని, ఆ అవార్డుపై ఉన్న గౌరవం తుడిచిపెట్టుకుపోయిందని కాస్త సీరియస్ అయ్యారు. దాసరి ఆవేదన అర్థం చేసుకోదగినదే. కళ్లముందు కైకాల సత్యనారాయణ, జమునలాంటి అతిరథ మహారధులున్నా… వాళ్లను కాదని పొలిటికల్ గాకాస్త పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు…పద్మశ్రీలను పట్టుకెళ్లిపోతున్నారు. సినిమా రంగానికి, అందునా తెలుగు చిత్రసీమకు పద్మశ్రీ విషయంలో ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంది.
బాపు – రమణలను గుర్తించిందెప్పుడు? కె.విశ్వనాథ్‌కు ప్రభుత్వం ఒక్క అవార్డయినా ఇచ్చిందా? సత్య నారాయణ, కోట… వీళ్లను మించిన నటులు సౌత్‌లో ఉన్నారా? ఇలా మాట్లాడుకొంటూ పోతే.. పద్మ విషయంలో తెలుగు చిత్రసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయం కళ్లముందు కనబడుతూనే ఉంటుంది. అంతెందుకు. 150 చిత్రాల ఘన చరిత్ర ఉన్న దాసరి నారాయణరావుకే పద్మశ్రీ లేదు.. అది ఇంకా హైలెట్టు. అందుకే.. దాసరి కూడా పద్మపై అలుగుతుంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా.. ఆ అవార్డులు ఇచ్చే తీరుపై ఇదిగో ఇలానే నిప్పులు చెరుగుతుంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆదివారం జరుపుకొన్న ఓ సన్మాన వేడుకలో కూడా దాసరికి ఇలానే… పద్మపై కోపం వచ్చింది. ఇలా మరోసారి బయటపడిపోయారు.