ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్ క్లబ్బులో ఆదివారం రాత్రి జరిగిన కాల్పులలో 50మంది చనిపోగా, మరో 53మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఒమర్ మతీన్ ని స్వాట్ పోలీస్ బృందం కాల్చి చంపింది. అతని కుటుంబం చాలా కాలం క్రితమే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వచ్చి ఫ్లోరిడాలోని సెయింట్ లూసి అనే ప్రాంతం స్థిరపడినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధాలు లేవు కానీ క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని తండ్రి మీర్ సిద్దిక్ ఈ విషయాన్ని దృవీకరించారు. తన కొడుకు స్వలింగ సంపర్కులని చూసి
అసహ్యించుకొనేవాడని, బహుశః అదే కారణం చేత ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని, తాము కూడా జరిగిన దానికి చాలా బాధపడుతున్నామని చెప్పారు. తన కొడుకికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు. కనుక ఈ కాల్పుల ఘటనకి ఉగ్రవాదం కారణమా? లేక అమెరికాలో నానాటికి పెరిగిపోతున్న గన్ కల్చర్ కారణమా? లేకపోతే మత ఛాందసవాదం కారణమా? అనే అనుమానాలు కలగడం సహజం.
ఒమర్ మతీన్ తండ్రి, పోలీసులు చెపుతున్న దానిని బట్టి చూస్తే, అతనికి సహజంగానే కొంత మత ఛాందసవాదం ఉందని అర్ధమవుతోంది. దానికి గన్ కల్చర్ కూడా తోడవడం చేతనే ఈ దారుణం జరిగిఉండవచ్చని భావించవచ్చు. అతనికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని అమెరికన్ పోలీసులు దృవీకరిస్తున్నప్పుడు, అతను తమ సంస్థ సభ్యుడేనని ఐసిస్ ఎందుకు ప్రకటించుకొంది? అనే అనుమానం కలగడం సహజం. ఇటీవల అగ్రరాజ్యాల వైమానిక దాడులలో ఐసిస్ సంస్థ చాలా తీవ్రంగా నష్టపోయింది. దాని ముఖ్యమైన నేతలు చాలా మంది ఆ దాడులలో చనిపోయారు. కనుక ఐసిస్ తన ఉనికిని చాటుకోవడానికి దీనిని ఒక అవకాశంగా భావించి, ఆ విధంగా ప్రకటించుకొని ఉండవచ్చు. అమెరికాతో సహా అన్ని దేశాలలో తాము దాడులు చేయగలమని హెచ్చరించడం దాని ఉద్దేశ్యం కావచ్చు.
ప్రపంచ వ్యాపతంగా అన్ని దేశాలలోని ఐసిస్ ఉగ్రవాద సంస్థకి సానుభూతిపరులున్న మాట వాస్తవం. అలాగే అమెరికాలో కూడా ఉండి ఉండవచ్చు. అది ఆ దేశానికి చాలా ఆందోళన కలిగించే విషయమే కానీ ఒమర్ మతీన్ మాత్రం ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు కనుక అతను మత ఛాందసవాదం కారణం చేతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు. అయితే కారణాలు ఏవైనప్పటికీ మద్యలో ప్రజలు బలైపోతున్నారు. కనుక వాటిని గుర్తించి నివారించక తప్పదు. అయితే మత ఛాందసవాదులని గుర్తుపట్టి, అటువంటివారి వలన సమాజానికి ఇటువంటి నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమేనా? అంటే అసాధ్యమేనని చెప్పక తప్పదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో నివసిస్తున్నా కూడా మత ఛాందసవాదాన్ని వదిలించుకోలేని ఒమర్ మతీన్ వంటివారి వలన ఆ దేశానికి ఎప్పటికీ ప్రమాదం పొంచే ఉంటుందని చెప్పక తప్పదు. దానికి గన్ కల్చర్ కూడా తోడయితే, ఇటువంటి విషాదకర సంఘటనలే పునరావృతం అవుతుంటాయి. కనుక అమెరికా ప్రభుత్వం కనీసం గన్ కల్చర్ ని కట్టడిచేయగలిగితే, ఈ సమస్య కొంతవరకు అదుపులోకి రావచ్చు.