సాధారణంగా ప్రజాసమస్యలపై పోరాడేవారు ప్రజలను కూడా కలుపుకొని పోరాడుతుంటారు కానీ ముద్రగడ పద్మనాభం తునిలో సభకి కాపులందరినీ కలుపుకొనే మొదలుపెట్టినప్పటికీ, ఆ తరువాత నుండి దానితో వారికి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి, సౌకర్యవంతమైన తన ఇంట్లో తలుపులు మూసుకొని నిరాహార దీక్షలు చేస్తుండటం చూసి కాపులు కూడా విస్తుపోతున్నారు. ఆయన చేస్తున్న పోరాటం తమ కోసమా లేక ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే దానికి కారణం ఆయన పోరాట స్వభావమే. కాపుల కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటునప్పుడు వారితో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని, వారితోనే కలిసి పోరాటాలు చేసి ఉంటే వాటిని ఎవరూ తప్పు పట్టేవారు కారు. ఆయన తనకు అనువుగా ఉన్నప్పుడు, తనకు నచ్చినట్లు తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలు చేసుకొంటున్నారు. ఆయన పోరాటానికి అసలు ఉద్యమ స్వభావమే లేదు. అందులో బెదిరింపు స్వభావమే ఎక్కువగా కనబడుతోంది.
కాపులకి రిజర్వేషన్లు కోసం ఉద్యమం మొదలుపెట్టిన ఆయన తుని విద్వంసానికి కారకులయ్యారు. ఆ సంఘటనని ఇంతవరకు కూడా ఆయన గట్టిగా ఖండించలేదంటే ఏమనుకోవాలి? పైగా దానికి బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే వారిని బేషరతుగా విడుదల చెయ్యాలని కోరుతూ నిరాహార దీక్షకి కూర్చోవడం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడమేనని అందరూ అభిప్రాయపడుతున్నారు.
తుని విద్వంసానికి తానే బాధ్యుడనని, తనని అరెస్ట్ చేయమని అమలాపురంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన ముద్రగడ పద్మనాభం, తీరాచేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేసరికి భయపడ్డారు. తనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారు. అది కూడా చాలా తప్పే. అది ఆయన పిరికితనాన్ని, అపరిపక్వ పోరాట స్వభావాన్ని సూచిస్తోంది. ఆ కారణంగా కాపులు కూడా ఆయనను మనస్పూర్తిగా సమర్ధించలేకపోతున్నారు. ప్రభుత్వంతో సహా చాల మంది ప్రజలు కూడా ఆయన తీరుని తప్పు పడుతున్నారు.
ఆయనకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి, రఘువీరా రెడ్డి, దాసరి నారాయణ రావు తదితరులు అందరూ తుని ఘటనలపై సిబిఐ దర్యాప్తు కోరుతుంటే, ఆయన మాత్రం వ్యతిరేకిస్తున్నారు? ఆ కేసు తన మెడకు చుట్టుకొంటుందని ఆయన భయపడుతున్నందునే సిబిఐ దర్యాప్తుకి నిరాకరిస్తున్నారని అనుమానించవలసి వస్తోంది. బహుశః ఆయన భయాలను గుర్తించిన ప్రభుత్వం అందుకే ఆయన కోరితే సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తామని మెలికపెట్టినట్లుంది. ప్రభుత్వం ఊహించినట్లుగానే అయన అంగీకరించలేదు కనుక ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆయనని వేలెత్తి చూపే అవకాశం కలిగింది. తుని విద్వంసానికి కారకులెవరో ఆయన చెప్పరు. ఏమి చేయాలో చెప్పలేరు. అరెస్టులు వద్దంటారు. సిఐడి పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదంటారు. సిబిఐ దర్యాప్తు వద్దంటారు. అంటే తుని విద్వంసాన్ని చూడనట్లు వదిలిపెట్టేయమని కోరుకొంటున్నట్లున్నారు. కనీసం ఆ మాటైనా ధైర్యంగా బయటకి చెప్ప(లే)రు. కాపులకి రిజర్వేషన్లు కోసం పోరాటం మొదలుపెట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు దేనికోసం పోరాడుతున్నారు? దాని వలన ఎవరికి ప్రయోజనం? ఆయన వలన సమాజంలో మిగిలిన కులస్థుల దృష్టిలో కాపుల గౌరవం పెరుగుతుందా తరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.