భారత్ లోనే కాదు అమెరికాలో కూడా రాజకీయ పార్టీలు శవరాజకీయాలు చేస్తాయని అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ నిరూపించారు. ఫ్లోరిడాలోని ఆర్లాండో నైట్ క్లబ్ లో ఆదివారం రాత్రి ఒక ముస్లిం మతోన్మాది విచక్షణారహితంగా కాల్పులకి తెగబడటంతో 53మంది చనిపోగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ సంఘటనని గట్టిగా ఖండించలేదని, ముస్లిం మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకపోయారని విమర్శించారు. కనుక బరాక్ ఒబామా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బరాక్ ఒబామా గట్టిగా మాట్లాడలేకపోయారన్నట్లుగా ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటువంటి బలహీనమైన నేతల అసమర్ధత కారణంగానే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని వాటిని తనవంటి ధైర్యవంతులు మాత్రమే నివారించగలరని ట్రంప్ అన్నారు. దేశంలో ముస్లింల విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు రావలసి ఉందని ట్రంప్ అన్నారు.
తను దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే నిత్యం దేశంలోకి ప్రవేశిస్తున్న వందలాది ముస్లింలను అడ్డుకొంటానని, ఇప్పటికే దేశంలో పనిచేస్తున్నవారి, అమెరికన్ పౌరసత్వం కూడా పొంది దేశంలో స్థిరపడిన ముస్లింల పూర్తి వివరాలు సేకరించేందుకు దేశ వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహిస్తానని డోనాల్డ్ ట్రంప్ చాలాసార్లు చెప్పారు. ఒకానొక సమయంలో ‘ముస్లింలందరూ తీవ్రవాదులే..వారికి దేశం ఉండే హక్కు లేదు’ అన్నట్లుగా ట్రంప్ మాట్లాడుతుంటారు. నిన్న జరిగిన సంఘటనలకు ఒక ముస్లిం మత ఛాందసవాదే కారణం కావడంతో ట్రంప్ తన వాదనని గట్టిగా సమర్దించుకోవడానికి దానిని ఒక అవకాశంగా భావించారు. కానీ ఒక వ్యక్తి లేదా సమూహం చేస్తున్న పొరపాట్లకి, ఆ వర్గానికి చెందిన ప్రజలందరినీ అనుమానించడం మొదలుపెడితే ఇక ప్రపంచంలో మిగిలేది అశాంతే! ట్రంప్ తన స్వంత అభిప్రాయలను ఆ దేశప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారని చెప్పకతప్పదు. దానిని అమెరికా ప్రజలు అంగీకరిస్తారో లేదో తెలియాలంటే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి చూడవలసిందే!