తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుండి అది మళ్ళీ ఎప్పటికైనా కోలుకొంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి దాదాపు అరడజను మంది హేమాహేమీలు అనదగ్గ నేతలు అందరూ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార తెరాసలో చేరిపోతున్నట్లు ఈరోజు ప్రకటించారు. నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్, మాజీ మంత్రి వినోద్, ఇద్దరు ఎమ్మెల్యేలు భాస్కర రావు, రవీంద్ర నాయక్ వారి అనుచరులు జూన్ 15న తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని తెంచుకొని తెరాసలోకి వెళ్ళిపోవలసి వస్తునందుకు తామంత చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తమ నియోజక వర్గాలు, రాష్ట్రాభివృద్ధి, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల కారణంగానే తెరాసలో చేరబోతున్నట్లు చెప్పారు. ఇంతకాలం తమని ఆదరించిన కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని ప్రకటించిన తరువాత వారు ఆ పార్టీతో తమ అనుబంధాన్ని తలుచుకొని మొసలి కన్నీళ్లు కార్చడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తమ ఈ ఉన్నతికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి నిజంగానే అభిమానం ఉండి ఉంటే కష్టకాలంలో ఉన్న దానికి అండగా నిలబడి తెరాస బారి నుండి దానిని కాపాడుకొనే ప్రయత్నం చేసి ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు ఒక వెలుగువెలిగిన వాళ్ళు అందరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని గ్రహించగానే తమ దారి తాము చూసుకొని వెళ్లిపోతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని గ్రహిస్తే, మళ్ళీ వాళ్ళు తెరాసకి గుడ్ బై చెప్పేసి నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చు.
ఒకప్పుడు ఉద్యమకారులతో నిండి ఉండే తెరాసలో ఇప్పుడు ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులతో నిండిపోయింది. ఇంతవరకు సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలే తెలంగాణాకి తీరని అన్యాయం చేశాయని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, నేతలు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు అదే కాంగ్రెస్, తెదేపా నేతలతో తెరాస నిండిపోయింది. మళ్ళీ వారికే అధికారం, మంత్రిపదవులు దక్కుతున్నాయి. ఇప్పటి తెరాసలో ముఖ్యమంత్రి కెసిఆర్ తరువాత కాంగ్రెస్, తెదేపా నేతలతే పైచెయ్యిగా ఉంది. తెలంగాణా కోసం పోరాడిన తెరాస నేతలు అది జీర్ణించుకోవడం చాలా కష్టంగానే ఉంది. తెరాసలో ఇటువంటి అభిప్రాయం వినిపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీలో ఏమీ చేయలేని నిసహాయత కనిపిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్కడి కాంగ్రెస్ పార్టీని, దాని నేతల రాజకీయ భవిష్యత్ ని పణంగా పెట్టి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా ఆ ఫలితం కాంగ్రెస్ పార్టీకి దక్కకపోగా ఈ విధంగా క్రమంగా తుడిచిపెట్టుకుపోవడం కాంగ్రెస్ వాదులకు చాలా బాధ కలిగించే విషయమే. ఒకప్పుడు తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొందామని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే తెరాసలో విలీనం అయిపోతోంది. ఆ విధంగానయినా కాంగ్రెస్ కోరిక నేరవేరుతోంది కదా? అని సంతోషపడక తప్పదు.