వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలంగాణా సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “రాజశేఖర్ రెడ్డి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి స్థానాన్ని ఆక్రమించాలని జగన్మోహన్ రెడ్డి చాలా ఆత్రపడ్డారు. రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలు పూర్తికాక ముందే, జగన్ తరపున కెవిపి రామచంద్రరావు ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టేశారు. అదే…వాళ్ళు మరో నాలుగైదు రోజులు వేచి చూసి ఉంటే బహుశః జగన్ కోరకపోయినా ఆయనకే ఆ అవకాశం దక్కేదేమో. కానీ జగన్ తొందరపాటు వలన ఒక మంచి అవకాశం కోల్పోయారు. ఆయన తరపున సంతకాలు చేసిన కెవిపి రామచంద్ర రావు కాంగ్రెస్ పార్టీలో నిక్షేపంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డే అధికారం కోసం చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారు..పాపం!” అని అన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా చాలా విషాదం అలుముకొని ఉన్నపుడు సహజంగానే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిపై చాలా సానుభూతి చూపారు. రాష్ట్ర స్థాయి పార్టీలో కూడా జగన్ పట్ల సానుభూతి నెలకొని ఉంది. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ సంగతి తెలుసు. అప్పటికప్పుడు వేరే ఎవరినో ముఖ్యమంత్రిగా నియమించడం కంటే అందరి సానుభూతి పొందుతున్న జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా నియమించినట్లయితే, పార్టీలో అసమ్మతిని నివారించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించి ఉంటే అదేమి అసహజమైన నిర్ణయం కాదు. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తరపున కెవిపి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం తప్పుడు సంకేతాలు పంపాయి. జగన్ కి ఎమ్మెల్యేలందరి మద్దతు ఉందని చెప్పడం దాని ఉద్దేశ్యం కానీ అది కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లయింది. తప్పనిసరిగా తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే పార్టీలో చీలిక ఖాయమని సంతకాల సేకరణతో అధిష్టానాన్ని హెచ్చరించినట్లయింది. తన కనుసన్నలలో దేశాన్ని పాలిస్తున్న సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి నుండి అటువంటి సవాలు స్వీకరించడం కష్టమే.
జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానం పట్ల విదేయత ప్రకటిస్తూ “ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాను,” అని చిన్న పడికట్టుపదం పలికి ఉండి ఉంటే సోనియా గాంధీ ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేవారేమో? ముఖ్యమంత్రి పదవి కాకపోయినా ఏదో ఒక కీలకమైన మంత్రిపదవి తప్పకుండా కట్టబెట్టి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి తొందరపాటు వలన అలవోకగా చేతిలో పడే ముఖ్యమంత్రి పదవిని కాలదన్నుకొని గత పదేళ్లుగా దాని కోసం చెట్లు, పుట్టలు పట్టుకొని తిరుగుతున్నారని వి. హనుమంత రావు అభిప్రాయం సరైనదే.
“జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడకుండా ఉండి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యుండేవారు” అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒకటి రెండుసార్లు అన్నారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వైకాపాని విలీనం చేసినా ఆయనని ముఖ్యమంత్రి చేయగల శక్తి సోనియాగాంధీకి కూడా లేవు. కనుక జగన్ తన కలను నెరవేర్చుకోవడానికి స్వయంకృషిని, అదృష్టాన్ని నమ్ముకోకతప్పదు. మరి ఆయన కల ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి.