మా టీవీ అవార్డు వేడుకలో చిరంజీవి వేసిన స్టెప్పులు ఆ కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచాయి. దాంతో పాటు చిరు తన 150వ సినిమాకి సంబంధించిన విశేషాల్నీ బయటపెట్టాడు. అయితే ఆ కార్యక్రమం కూడా కాస్త వినూత్నంగానే సాగాయి. ముందు ఇంద్రకు సంబంధించిన గెటప్‌లో చిరు తెరపై కనిపించాడు. 150వ సినిమాలో ఇంద్రలా సందేశం ఉండేలా చూసుకోమని.. చిరుకి సలహా ఇచ్చాడు. ఆ వెంటనే ముఠామేస్త్రీలోని బోస్ వచ్చాడు. ‘బాసూ.. మాసూ..’ అంటూ గుర్తు చేశాడు. మాస్ కి నచ్చే అంశాలు కూడా 150వ సినిమాలో ఉంటాయని.. బోసుకి మాటిచ్చాడు చిరు. ఆ తరవాత ఘరానామొగుడులోని రాజు ఎంట్రీ ఇచ్చాడు. ‘బాసూ కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ. 150వ సినిమాలో రొమాన్స్ మాటేంటి? అంటూ నిలదీశాడు. అది లేకపోతే ఎలా.. అంటూ చిరు సమాధానం ఇచ్చాడు.
ఆఖర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ వచ్చి కామెడీని గుర్తు చేశాడు. అనేక సమస్యలతో సతమతమై థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి వినోదం అందిస్తా అని చిరు మాటిచ్చాడు. అంటే చిరు సినిమాలో సందేశం, రొమాన్స్, మాస్, కామెడీ.. ఇవన్నీ మిక్స్ చేశారన్నమాట. వీటన్నింటితో చరిత్రలో నిలిచిపోయే సినిమా అందిస్తానని ఆ నాలుగు క్యారెక్టర్ల సాక్షిగా చిరు మాటిచ్చాడు. ఆ తరవాతే.. గ్యాంగ్ లీడర్ లో చికు చికు చైలం.. చైలం అనే పాటకు శ్రీకాంత్, సాయిధరమ్‌తేజ్, సునీల్‌లతో కలసి స్టెప్పులేశాడు చిరు.