సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ నుంచి ఇంకా పవన్ కల్యాణ్ బయటపడలేదనిపిస్తోంది. ఎప్పుడూ తన సినిమా ఫలితాల గురించి విశ్లేషించుకోని పవన్… సర్దార్ విషయంలో మాత్రం తప్పెక్కడ జరిగింది అన్న విషయంపై తన సన్నిహితుల దగ్గర ప్రతీ రోజూ ఏదో ఓ సందర్భంలో ప్రస్తావిస్తూనే ఉన్నాడట. అంచనాలు భారీగా పెరిగిపోయాయని, వాటిని అందుకోవడంలో విఫలమయ్యామని పవన్‌కి ఆయన సన్నిహితులు చెబుతూ వస్తున్నార్ట. సర్దార్ కోసం చిత్ర బృందం కావాలనే హైప్ క్రియేట్ చేసింది. దాంతో.. బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఆ హైప్‌తో.. జనాలు థియేటర్‌కి వచ్చారు. వాళ్లకు ఏమాత్రం సినిమా ఎక్కలేదన్నది చిత్రబృందం తేల్చిన విషయం. చివర్లో కంగారు కంగారుగా సినిమా చుట్టేయాల్సిరావడం కూడా కొంపముంచేసిందని రూఢీ అయ్యింది.
అందుకే సర్దార్ ఫ్లాప్‌నే పాఠాలుగా తీసుకోబోతున్నాడట పవన్. ప్రస్తుతం ఎస్.జె.సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ భావిస్తున్నాడు. ఎలాంటి హైప్ పెరక్కుండా చూడాలని ఇప్పటికే నిర్మాతకు గట్టిగా చెప్పేశాడట. షెడ్యూల్ అనుకొన్న టైమ్ లో పూర్తి కావాలని, చివర్లో హడావుడిగా సినిమా చుట్టేసే పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టాలని పవన్ భావిస్తున్నాడు. అంతే కాదు.. ఎలాంటి సినిమా తీయబోతున్నామో, జనాలకు ముందే ఓ హింట్ ఇవ్వాలని, దాంతో ముందుగా ప్రిపేర్ అయి వస్తారని పవన్ చెబుతున్నాడట. ఎన్ని చేసినా కథలో కొత్తదనం కథనంలో వేగం, సినిమాలో విషయం లేకపోతే ఏ సినిమా ముందుకు నడవదు. ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకొని సినిమా తీస్తే.. ఇదో ఖుషి అవుతుంది. లేదంటే పులిలా భయపెడుతుందంతే.