ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష వ్యవహారంలో ఈసారి ఏపి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉన్నట్లుంది. కానీ ఆ వైఖరి వలన ఈసారి ప్రభుత్వానికే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుని విద్వంసానికి కారకులైనవారిని విడిచిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం మొదలుపెట్టినప్పుడు, ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల సానుకూలత కనిపించాయి. అందుకే ప్రభుత్వం కూడా ఆయనతో కొంచెం కటినంగా వ్యవహరించింది. కానీ అది మరీ శృతిమించడంతో అందరూ ఇప్పుడు ప్రభుత్వాన్నే విమర్శించడం మొదలుపెట్టారు. దానితో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లయింది.
ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికి 6 రోజులయింది. ఆయనని కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంతవరకు ప్రజలకి సమాచారం కూడా ఇవ్వలేదు. అసలు ఆయన ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఈ వ్యవహారంలో ఇంత గోప్యత, ఇన్ని ఆంక్షలు అవసరమా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఆయనతో విభేదించిన కాపులు కూడా ప్రభుత్వ వైఖరి కారణంగా ఆయనపై ఇప్పుడు సానుభూతి చూపుతున్నారు. ఆయనకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వం ఆయన దీక్షని భగ్నం చేయదలచుకోకపోతే ఆ విషయం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి ఉంటే, అదే తగిన నిర్ణయం తీసుకొని ఉండేది. తద్వారా ఇక ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండేది కాదు. లేదా బలవంతంగా ఆయన దీక్షని భగ్నం చేసి ఆసుపత్రి నుండి విడుదల చేసినా ఉద్రిక్తలు క్రమంగా తగ్గుముఖం పట్టేవి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదు.
తుని విద్వంసానికి కారకులైనవారిని బేషరతుగా విడుదల చేస్తే తప్ప దీక్ష విరమించేది లేదని ముద్రగడ చాలా స్పష్టంగా చెపుతున్నప్పుడు, అందుకు అంగీకరించబోమని చెపుతూనే ఆయనని దీక్ష విరమించమని ప్రభుత్వం అభ్యర్ధించడం వలన ప్రయోజనం ఉండదు. మధ్యవర్తుల ద్వారా ఆయనకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయం కూడా చాలా గోప్యంగా ఉంచడంతో అసలు ఏమి జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈవిధంగా వ్యవహరించడం వలన ప్రభుత్వమే ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది.
ఒకవేళ ముద్రగడ ఆరోగ్యపరిస్థితి ఇంకా క్షీణించి ఆయన ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే అప్పుడు ప్రభుత్వమే దోషిగా నిలబడవలసి వస్తుంది. కనుక ఆయన దీక్ష, ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకి, న్యాయస్థానానికి తక్షణమే తెలియజేయడం మంచిది. అలాగే ఆంక్షలు సడలించి కాపు నేతలు ఆయనని కలిసేందుకు అంగీకరించడం మంచిది. లేకుంటే ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తే ప్రభుత్వానికి మరో కొత్త సమస్య ఎదురవుతుంది.