జూన్ 9 నాటికి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 3న ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇంకో పదిహేను రోజులకైనా నీరుపారుతుందా అంటే ”పనులైతే ఖాయంగా పూర్తవుతాయి. నీరువెళ్తుందో లేదో చెప్పలేము” అని సంబంధిత ఇంజనీర్ చెప్పారు.
పట్టిసీమ మీద కొండంత ఆశలు పెట్టుకుని ఖరీఫ్ సాగుకి సిద్ధమౌతున్న కృష్ణా డెల్టారైతుల్ని ఈపరిస్ధితి గందరగోళం లోకనట్టేస్తోంది.
ఏమైతేనేమి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పెద్ద ప్రహసనంగా మారింది. నదుల అనుసంధానం కాన్సెప్టుతో , కృష్ణా-గోదావరి నదులను కలిపెయ్యడానికి ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అట్టహాసంగా శంకుస్థాపన చేసి నాలుగుసార్లు ఆర్భాటంగా ప్రారంభించారు.
పట్టిసీమ ద్వారా నీటని మళ్లించడానికి కాల్వలు సిద్ధమైనా వివిధ కట్టడాల నిర్మాణాలే ఆలస్యమవుతున్నాయి. ఏలూరు సమీపంలోని పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న అక్విడెక్టు పనులు ఒక కొలిక్కి రాలేదు. ఇవికాకుండా చిన్నచిన్న నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇవి ఎట్లా ఉన్నా తమ్మిలేరు అక్విడెక్టు కచ్చితంగా పూర్తి కావాల్సిందే. లేకపోతే పట్టిసీమ నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కాంట్రాక్టర్లు జానంపేట అక్విడెక్టును పూర్తి చేయడానికి చర్యలు ముమ్మరం చేసినా పూర్తి కావడానికి మరో పది నుంచి 15 రోజులు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్విడెక్టు పక్కన గోడలు, శ్లాబ్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.
తమ్మిలేరును ఆనుకుని ఏలూరు-చింతలపూడి రహదారిపై నిర్మాణాల ప్రగతి ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మే నెల కల్లా కట్టడాలు నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం గత సంవత్సరమే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పనులు మందకొడిగా సాగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తక్కువ మంది కూలీలతోనే పనులు పూర్తి చేయడం వల్ల ప్రగతి కుంటుపడింది. 120 కిలో పొడవున ఉన్న కుడి కాల్వ నీటి ప్రవాహానికి వివిధ కట్టడాలే ప్రధానం. గుండేరు, తమ్మిలేరు, రామిలేరుపై అక్విడెక్టుల నిర్మాణం చేపట్టారు. దీంట్లో గుండేరుపై నిర్మాణం పూర్తి చేశారు. తమ్మిలేరుపై ఇంకా కొసాగుతూనే ఉంది. ఈ మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల కూడా పనులు మందగించినట్లు చెబుతున్నారు.
మరో పక్క గోదావరిలో 14 మీటర్ల జలాలు వుంటేనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తరలించాల్సి ఉంది. 14 మీటర్ల జలాలు పట్టిసీమ వద్దకు ఇంకా చేరుకోలేదు.
అయితే ఇంజినీర్లు మాత్రం సీలేరు నుండి జలాలను తీసుకువచ్చి డెల్టాకు పంపుతామని చెబుతున్నారు. ఇవన్నీ జరిగితేనే ముఖ్యమంత్రి మాటల ప్రకారం ఈ ఖరీఫ్, వచ్చే రబీ సీజన్లో గోదావరి జలాలు కృష్ణా డెల్టా వరి సాగుకు అందుతాయి.
అదంతా అవుతుందో లేదో ప్రస్తుతానికి అనుమానమే!