టాప్ హీరోతో సినిమా అనగానే యువ దర్శకులు ఎగిరిగంతేస్తారు. ఆ సినిమాని హిట్ చేస్తే వాళ్లు కూడా టాప్ దర్శకుల జాబితాలో చేరిపోతామన్న నమ్మకం వాళ్లది. అయితే అక్కడే ఓ చిక్కుంది. ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. అది వాళ్ల కెరీర్‌తో ఆటలాడుకోవడం మొదలెడుతుంది. ప్రస్తుతం బాబి విషయంలో అదే జరుగుతోంది. పవర్ సినిమాతో తన పవర్ చూపించాడు బాబి. ఆ సినిమా మరీ సూపర్ డూపర్ హిట్ కాదుగానీ, బాబిలోని కమర్షియల్ టాలెంట్ జనాలకు తెలిసొచ్చింది. అక్కడ్నుంచి అనుకోకుండా పవన్ కల్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అవకాశం వచ్చింది. రెండో సినిమాకే పవన్‌ని డైరెక్ట్ చేసే ఆ సూపర్ ఛాన్స్ చూసి ఇండ్రస్ట్రీ అంతా అవాక్కయ్యింది. బాబి అదృష్టానికి కుళ్లుకొంది. ఆ దిష్టే తగిలేసింది బాబికి. సర్దార్ – గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాబి ఇక ఎక్కడా కనిపించలేదు. బయట ఫంక్షన్లలోనూ బాబి జాడ లేదు.
సర్దార్ ఫ్లాప్‌తో ఈ యువ దర్శకుడు బాగా అప్సెట్ అయినట్టు టాక్. నిజానికి ఈ ఫ్లాప్ భారమంతా బాబి మోయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సినిమా యావత్తూ పవన్ కల్యాణ్ కనుసన్నల్లో సాగింది. పవన్ కథ అందించి, ఆల్మోస్ట్ డైరెక్షన్ కూడా చేసేశాడు. బాబినేకాదు. ఈ సినిమాకి ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు తెర వెనుక నుంచి పనిచేశారు. అలాంటప్పుడు ఈ ఫ్లాప్ బాధ్యత బాబిది ఎందుకు అవుతుంది..?? అయితే ఇండ్రస్ట్రీకి కావాల్సింది హిట్, ఫ్లాప్ మాత్రమే! దాంతో సర్దార్ బాబి ఎకౌంట్లోకి పడిపోయింది. అయినా సరే.. బాబి తన వంతు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నాడని వినికిడి. ఓ యువ హీరోకి కథ చెప్పాడని, అది ఆల్మోస్ట్ ఓకే అయిపోయే స్టేజీలో ఉందని టాక్. ఆ సినిమా గురించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చిన తరవాతే.. బాబి కనిపిస్తాడేమో.