తమ సుదీర్గ పోరాటాల వలననే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని తెరాస నేతలు చెప్పుకొంటారు. కాదు…తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణా ఏర్పాటు చేశారని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటారు. అదేమీ కాదు…2014 ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా లోక్ సభ సీట్లు గెలుచుకొని కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆంధ్రాలో జగన్, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఎన్నికలలోగా విభజన ప్రక్రియని చాలా హడావుడిగా పూర్తి చేసిందనే మరో వాదన కూడా ఉంది. అందుకే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణని మహారాష్ట్రకి పంపించేసిందని, జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి విదిపించి బయటకి తీసుకు వచ్చిందనే వాదన కూడా వినిపిస్తుంటుంది. ఆ కారణాలకి వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇవ్వాళ్ళ మరో సరికొత్త కారణం జోడించారు. అది వినడానికి చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా కూడా ఉంది. కానీ కాంగ్రెస్, వైకాపాల మద్య రహస్య అవగాహన ఉందనే వాదనకి అది బలం చేకూర్చినట్లుంది.
ప్రస్తుతం బందరు రోడ్డులో జరుగుతున్న వైకాపా విస్త్రుత సమావేశాలలో మాట్లాడిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర విభజన జరుగకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే యూపియే ప్రభుత్వం అందుకు పూనుకొందని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకే పరిమితం అవుతారు కనుక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి రాగలదని కొందరు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి నచ్చ జెప్పడం వలననే ఆమె రాష్ట్ర విభజనకి అంగీకరించారని మేకపాటి చెప్పారు. అయితే యూపియే ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా అశాస్త్రీయంగా, చాలా దుర్మార్గంగా విభజించిందని ఆరోపించారు. తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మేకపాటి అన్నారు.
తెరాస చేసిన ఉద్యమాల కారణంగానే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, విభజన చేయడం వలననే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం ఉంటుందని సోనియా గాంధీ భావించడం చేతనే అందుకు సిద్దపడిన సంగతి బహిరంగ రహస్యమే. మేకపాటి రాజమోహన్ రెడ్డి చెపుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రాకే పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించడం నిజమైతే, ఆయన జైలు నుంచి విడుదలవడం కూడా ఆ వ్యూహంలో భాగమేనని భావించవలసి ఉంటుంది.
ఒకవేళ కేంద్రంలో మళ్ళీ యూపియే అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంటే దానికి మద్దతు ఇచ్చే విషయం పరిశీలిస్తానని జగన్ అప్పుడే చెప్పారు. అదే విషయాన్ని వైకాపాలో చేరలనుకొన్న కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి బహిరంగంగా ప్రకటించారు కూడా. ఆయన ప్రకటన వలన కాంగ్రెస్, వైకాపాల మద్య రహస్య అవగాహన ఉందనే తెదేపా ప్రచారం ప్రజలు నమ్మితే ఎన్నికలలో పార్టీకి చాలా నష్టం కలుగుతుందనే భయంతో, సబ్బం హరికి పార్టీలో చేరకముందే వైకాపా తలుపులు వేసిన సంగతి తెలిసిందే.
అయినా వైకాపా నేతలు ఈవిధంగా గతాన్ని త్రవ్వుకొంటూ కాలక్షేపం చేయడం కంటే, రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితిని సమీక్షించుకొని, దానిని ఏవిధంగా ఇంకా బలోపేతం చేసుకోవాలి? తెదేపాని ఏవిధంగా ఎదుర్కోవాలి? అని ఆలోచిస్తే వారికీ, వైకాపాకి కూడా ఏమైనా ఉపయోగం ఉంటుంది కదా!