చిరంజీవి సినిమాపై నీలినీడలు కమ్ముకొంటూనే ఉన్నాయి. అన్నీ ఓకే అనుకొంటున్న తరుణంలో ఇంకో కొత్త సమస్య పురివిప్పుతూనే ఉంది. కత్తి స్ర్కిప్టు పూర్తి స్థాయిలో సిద్దమైంది.. ఇక సెట్‌కి వెళ్లడమే ఆలస్యం అనుకొంటున్న తరుణంలో ఈ సినిమాపై మరో పుకారొచ్చింది. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న 150వ చిత్రం కత్తి రీమేక్ కాదని, కథ మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కత్తి కథలో మరీ సందేశాలు ఎక్కువైపోతాయని, అలాంటి కథలు తెలుగులో ఇప్పట్లో చూడరని, అందుకే కథని మార్చేయాల్సివచ్చిందని, వినాయక్ కూడా చిరుకి సరిపడ కథ సిద్దం చేశాడని చెప్పుకొంటున్నారు.
ఇంత సడన్‌గా కథ ఎలా మారిపోయిందబ్బా? అని చిరు అభిమానులు కూడా బెంగ పెట్టుకొన్నారు. రిమేక్ కథలు సక్సెస్ ఫార్ములానే కావొచ్చు. కానీ అవి ఎల్లవేళలా వర్కవుట్ కావన్నది కొంతమంది అభిప్రాయం. చిరు చేసిన ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఆ నమ్మకంతోనే కత్తి రీమేక్ ఎంచుకొన్నారు. మరి ఇప్పుడు కొత్తగా భయాలెందుకుపట్టుకొన్నాయో? ఇదే విషయంపై చిరు సన్నిహితులు తెలుగు 360 డాట్‌కామ్‌తో మాట్లాడుతూ ”కత్తి రీమేక్ కథ మారిందన్న విషయంలో వాస్తవం లేదు. చిరు చేస్తోంది కత్తి రీమేకే. అయితే.. చాలా సన్నివేశాలు మారుతున్నాయి. వినాయక్ ఓ ఫ్రెష్ సినిమాని చూపించబోతున్నాడ”న్నారు. అంటే.. కత్తి పై వచ్చిందంతా రూమరే అన్నమాట.