ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో కాంట్రాక్టుల ముసలం పుట్టింది. అది పార్టీని నాశనం చేస్తోంది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, భాస్కర రావు తదితర ఒక అరడజను మంది కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వారు కూడా ఏవైనా కాంట్రాక్టులు సంపాదించుకొని వాటిని కాపాడుకోనేందుకే తెరాసలో చేరుతున్నారేమో ఇంకా తెలియవలసి ఉంది. వారి తరువాత జానారెడ్డిపై ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా రాజినామాకి సిద్ధపడ్డారు. ఇంకా ఎందరు రాజీనామాలు చేస్తారో, ఎంతమంది పార్టీని వీడి వెళ్లిపోతారో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
విశేషం ఏమిటంటే ఆ ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్ నిరాహార దీక్షలు చేస్తే, వైకాపాకి చెందిన నేతలు కూడా తెలంగాణా ప్రాజెక్టులలో కాంట్రాక్టులు దక్కించుకొన్నారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దృవీకరించారు కూడా.
రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పార్టీల నేతలు కూడా తెలంగాణాలో చిన్నవో పెద్దవో కాంట్రాక్టులు దక్కించుకొన్నారని ఆయనే చెప్పారు. కనుక తెలంగాణాకే చెందిన జానారెడ్డి కాంట్రాక్టులు దక్కించుకొని ఉంటే అదేమీ పెద్ద విచిత్రం కాదు.
ఇదంతా చూస్తుంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా తెలివిగా రెండు రాష్ట్రాలలో రాజకీయాలను అదుపు చేస్తున్నట్లుంది. వివిధ పార్టీల నేతలకి చెందిన కంపెనీలకి కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా వాళ్ళందరినీ ఆయన తన గుప్పెట్లో పెట్టుకొన్నట్లయింది. ఆయన నోరు విప్పితే అందరి రహస్యాలు బయటపడతాయి. కనుక ఎవరూ కూడా కెసిఆర్ ని ఆయన ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే సాహసం చేయలేరు. కాంట్రాక్టులు దక్కని కారణంగానే పాల్వాయి గోవర్ధన్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ, అవి పొందిన కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నారనుకోవలసి వస్తోంది. అదే నిజమైతే రాజకీయాలను, నేతలను అదుపు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదో కొత్త పద్దతిని కనుగొన్నారని చెప్పక తప్పదు.
బహుశః ఈ విధానం ఎప్పటి నుంచో అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని చాలా సమర్ధంగా ఉపయోగించుకొంటున్నట్లు కనిపిస్తోంది. ఈ పద్దతిలో రాజకీయ నేతలను అదుపు చేయడమే కాదు, అవసరమైనప్పుడు పార్టీలను కూడా కూల్చివేయచ్చని స్పష్టం అవుతోంది. అందుకు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష నిదర్శనంగా కళ్ళ ముందుంది.