తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ చాలా ఐకమత్యంగానే పోరాడాయి. కానీ సమైక్యాంధ్ర కోసం ఏపీలో రాజకీయ పార్టీలు మాత్రం అటువంటి ఐఖ్యత ప్రదర్శించకపోగా సమైక్య ఉద్యమాల పేరిట కపట నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర విభజన జరిగేందుకు కేంద్రానికి పరోక్షంగా తమవంతు సహకారం అందించాయి. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ సరిగ్గా అటువంటి నాటకాలే మొదలుపెట్టాయి. వాటి రాజకీయ చదరంగంలో అప్పుడే మునికోటి అనే ఒక వ్యక్తి బలయిపోయాడు.
అందుకు తెదేపా, బీజేపీలనే మొదట నిందించవలసి ఉంటుంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన ఆ రెండు పార్టీలు ఏడాదిన్నర కాలం గడిచిపోయినా ఇంకా నేటికీ ప్రత్యేక హోదా త్వరలోనే వస్తుందని ఒకసారి, అసలు వచ్చే అవకాశమే లేదని మరొకసారి పరస్పర విరుద్దమయిన ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్దులయిన బీజేపీ, తెదేపాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇదే అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోయగల మృతసంజీవనీ మూలికలా ఉపయోగించుకోవాలని ఆరాటపడుతోంది.
తెదేపా-బీజేపీల మధ్య విభేదాలు వచ్చి విడిపోతే బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంతకాలంగా వేచిచూసిన వైకాపా ఇక అది సాధ్యం కాదని గ్రహించడంతో ఆ పార్టీ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదాని ఆయుధంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించేసింది. ఇదివరకు సమైక్యాంధ్ర ఛాంపియన్ అనిపించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పోటీపడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేక హోదా ఛాంపియన్ షిప్ కోసం కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగినట్లు కనిపిస్తోంది. ఆయన రేపు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు దీక్ష చేయబోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలహీనపడిన వామపక్షాలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టాయి.
పార్లమెంటులో ప్రత్యేక హోదా కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయకుండా తెదేపా, బీజేపీ ఎంపీలు తమ వ్యాపారలపైనే ఎక్కువ శ్రద్దపెడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేసిన తరువాత ఈ బాధలు, ఒత్తిడి భరించలేక తెదేపా ఎంపీలు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. పార్టీలన్నీ తమ తమ రాజకీయ ప్రయోజనాలను చూసుకొంటూ ఈ ప్రత్యేక హోదా అంశంపై ఉద్యమిస్తున్నాయి. కానీ ఎవరికీ కూడా ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకమూ లేదు. సాధించాలనే పట్టుదల అంతకంటే లేదు.