గత రెండేళ్ళలో తెదేపా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడల్లా (ఓటుకి నోటు వ్యవహారంలో తప్ప) ఆదుకొనేందుకు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెళ్లిపోవడం అందరూ చూశారు. మళ్ళీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష కారణంగా తెదేపా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ తప్పకుండా వచ్చి తెదేపాని ఆదుకొంటాడని ఆశించవచ్చు. ముద్రగడ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కాపులలో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. దానిని తగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల చేత మాట్లాడిస్తున్నప్పటికీ దాని వలన ఎటువంటి ప్రయోజనం కనబడటం లేదు. సిబిఐ విచారణ అస్త్రాన్ని ప్రయోగించినా ముద్రగడ చేత దీక్షని విరమింపజేయలేకపోయారు. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం మళ్ళీ కనబడుతోంది.
పవన్ కళ్యాణ్ కులమతాలకి అతీతంగా ఉండాలనుకొంటునప్పటికీ మన రాజకీయాలలో అది సాధ్యం కాదనే విషయం ఆయన కూడా గ్రహించారు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు అభ్యర్ధిస్తే రంగప్రవేశం చేయవచ్చు. పవన్ కళ్యాణ్ మాటలని ముద్రగడ పద్మనాభం వింటారనే నమ్మకం లేదు కానీ ఆఖరి ప్రయత్నంగా ప్రభుత్వం ఆయన సహాయం కోరవచ్చు.
అయితే ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్లు కోసం కాక తుని విద్వంసానికి కారకులైన వారిని విడిచిపెట్టాలని కోరుతూ నిరాహారదీక్ష చేస్తున్నందున ఆయనతో రాయబారం నెరిపేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారో లేదో చెప్పలేము. ఒకవేళ ఆయనతో పవన్ కళ్యాణ్ మాట్లడదలచుకోకపోతే, రాష్ట్రంలో కాపులకి ఉపశమనం కలిగే విధంగా మాట్లాడి, ప్రభుత్వం పట్ల వారిలో వ్యతిరేకతని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు.