సుమారు 18 ఏళ్ళపాటు మీడియా లో జర్నలిస్ట్ గా పనిచేసిన కన్నబాబు అనుకోకుండా రాజకీయాలలోకి ప్రవేశించారు. చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రోత్సాహంతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత అందులో ఇమడలేక బయటకు వచ్చేశారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేయమని చిరంజీవి కోరారు కానీ రాష్ట్ర విభజన చేసిన ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి కన్నబాబు ఇష్టపడలేదు. తెదేపా నుంచి కూడా తనకి ఆఫర్ వచ్చింది కానీ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత వైకాపా ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఉద్యమం నిరాహార దీక్ష, ప్రభుత్వ వైఖరి గురించి తెలుగు 360 తరపున గోపాల్ గారు ఆయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఒక మంచి అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా వాటిపై చాలా లోతుగా విశ్లేశించుతూ తన అభిప్రాయలు చెప్పారు. కన్నబాబు ఇంటర్వ్యూ వివరాలు:
ప్రశ్న: ముద్రగడ పోరాటంపై మీ అభిప్రాయం ఏమిటి?
కన్నబాబు: ఈ సమస్య చాలా దశాబ్దాలుగా ఉంది. దానిని పరిష్కరిస్తానని చంద్రబాబు స్వయంగా తన పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏడాదిన్నర కాలం గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. ఆ కారణంగానే ముద్రగడ ఉద్యమం మొదలుపెట్టవలసి వచ్చింది. తుని ఘటనలని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకొని ముద్రగడని దెబ్బ తీయవచ్చనే ఉద్దేశ్యంతో కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ప్రజలని నిత్యం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తూ వారిలో భయాందోళనలు రేకెత్తించారు. అదే సమయంలో తన కాపు మంత్రులు, నేతల చేత ముద్రగడకి వ్యతిరేకంగా మాట్లాడించారు. ఇవన్నీ కాపులలో ఒకరకమైన అభద్రతాభావం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని ఏర్పరిచాయి. అయినప్పటికీ చంద్రబాబు అది గురించకుండా ముందుకు సాగారు.
నిజానికి ఇదొక సామాజిక సమస్య. కానీ దానిని చంద్రబాబు రాజకీయ సమస్యగా ట్రీట్ చేయడం మొదలుపెట్టి చివరికి శాంతిభద్రతల సమస్యగా మార్చివేశారు. ముద్రగడ ఇంటి చుట్టూ, ఇప్పుడు రాజమండ్రిలో ఆసుపత్రి చుట్టూ వందలాది మంది పోలీసులని మోహరించడం, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం వంటివన్నీ చూస్తే ఈ సమస్యని చంద్రబాబు ఏవిధంగా మలుపులు తిప్పుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. సున్నితంగా పరిష్కరించవలసిన ఈ సమస్యని చంద్రబాబు చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే ఈ సమస్య ఇంత జటిలమైపోయిందిప్పుడు.
ప్రశ్న: మొదట ఆయన పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే దానిని ఆయన దురుపయోగం చేసి రైలు తగులబెట్టారని తెదేపా మంత్రులు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి?
కన్నబాబు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అమాయకులు. రాయలసీమ నుంచి వచ్చిన సంఘవిద్రోహక వ్యక్తులే ఆ పని చేశారని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేకసార్లు చెప్పారు. అప్పటికి పోలీసులు దర్యాప్తు కూడా పూర్తి కాలేదు. పోలీసుల కంటే ముందుగానే ఆయన ఏవిధంగా అలాగ చెప్పగలిగారు? అప్పుడు గోదావరి జిల్లా ప్రజలు అమాయకులని చెప్పిన వాళ్ళే ఇప్పుడు వారిపై ఎందుకు కేసులు పెడుతున్నారు? పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిప్పిస్తున్నారు? అసలు అక్కడ వైకాపాకి చెందినవాళ్ళెవరూ అక్కడ లేకపోయినా, దానికి వైకాపా, జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపిస్తూ, అసలు సమస్యని పక్కదారి పట్టించేప్రయత్నం చేస్తున్నారు. ఎవరినో దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో ఆవిధంగా మాట్లాడినందున, ప్రభుత్వమే ఇదంతా చేస్తోందనే అభిప్రాయం ప్రజలకి కలిగేలా చేస్తోంది.
ప్రశ్న: ముద్రగడ మొదటిసారి నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది? వాటిని అమలు చేసిందా లేదా?
కన్నబాబు చాలా హామీలు ఇచ్చింది కానీ కొన్నే అమలు చేసింది. తుని ఘటనలపై ఎవరిపై కేసులు నమోదు చేయబోమని చెప్పారు. కానీ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కాపు కార్పోరేషన్ కి రూ 1500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అందులో సగం మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకొనే ప్రయత్నం చేయకుండా, తమని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. ఉద్యమకారులపై ఎదురుదాడి చేస్తే అది ఉద్యమం ఇంకా బలపడేందుకే దోహదపడుతుంది తప్ప దానితో అణచివేయడం సాధ్యం కాదు. చంద్రబాబుకి ఇది తెలియదనుకోలేము. కానీ ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారంటే ఈ సమస్యని ఏవిధంగా పరిష్కరించాలో తెలియని అయోమయంలో ఉండటం వలననే!
ప్రశ్న: గత ప్రభుత్వాల కంటే తెదేపా కాపులకి చాలాప్రాధాన్యత ఇచ్చారు. కాపులలో ఆయనకి వచ్చిన మంచి పేరుని చెడగొట్టి కాపులని తెదేపాకి దూరం చేయడానికే ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ముద్రగడని ప్రయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి?
కన్నబాబు కాదు. ఈ సమస్యని ప్రభుత్వం రాజకీయ సమస్యగా ట్రీట్ చేసి చేజేతులా ఈ పరిస్థితిని తెచ్చుకొంది తప్ప ఎవరూ ముద్రగడని వెనుక నుండి ప్రోత్సహించలేదు. చంద్రబాబు కాపులని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారు. వారి కోసం ముద్రగడ దీక్ష మొదలుపెట్టినప్పుడు ఆయనని ఒక వ్యక్తిగానే చూశారు తప్ప ఆయన లక్షలాది కాపులకి ప్రతినిధిగా గుర్తించలేదు. అందుకే ఆయన పట్ల అంత రఫ్ గా వ్యవహరించారు. అది కాపుల మనోభావాలను దెబ్బ తీస్తోందనే విషయం చంద్రబాబు గమనించకుండా, నేటికీ ఆయన పట్ల అలాగే వ్యవహరిస్తున్నారు.
అసలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం మొదలుపెడితే దాని పరిణామాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఎస్టీ వర్గీకరణ సమస్యని చంద్రబాబు లేవనెత్తారు. అది నేటికీ రావణకాష్టంలాగ మండుతూనే ఉంది. కాపుల రిజర్వేషన్ల కోసం కమీషన్ వేశారు. కానీ ఇంతవరకు దాని విదివిదానాలే ప్రకటించలేదు. కానీ మరో రెండు మూడు నెలల్లో దాని నివేదిక రాగానే రిజర్వేషన్లు ఇస్తామని చెపుతుంటారు. అది ఎలాగ సాద్యం? మంత్రుల చేత అటువంటి విషయాలపై వివరణ ఇప్పించి ప్రజల సందేహాలు నివృతి చేయించాలి తప్ప ప్రత్యర్ధులపై ఎదురుదాడికి వాడుకోకూడదు.
ప్రశ్న: పార్క్ హయత్ లో వివిధ పార్టీలకి చెందిన కాపు లీడర్లు సమావేశమయ్యారు. దానికి ఎవరు చొరవ తీసుకొన్నారు?
కన్నబాబు ప్రత్యేకంగా ఎవరూ కాదు. అందరూ అప్పటికప్పుడు అనుకొని కలిశారు. అంతే!
ప్రశ్న: ఇది కాంగ్రెస్ పార్టీ, వైకాపాలని దగ్గిరకి చేర్చేందుకు ఏర్పాటు చేసినదా?
కన్నబాబుకాదు. ఇది పార్టీలకి అతీతంగా జరిగినది. భాజపా నేతలని కూడా ఆహ్వానించాము. కానీ వారు వేరే పనులలో తీరిక లేకపోవడం వలన తరువాత సమావేశానికి వస్తామని చెప్పారు.
ప్రశ్న: ముద్రగడ ఈ దీక్షకి కూర్చొనక ముందు చాలా మందిని కలిశారు. అంటే వాళ్ళందరికీ ఆయన తను దీక్షకి కూర్చోబోతున్నట్లు ముందుగానే చెప్పరంటారా? ఆ ప్లాన్ లో భాగంగానే కాపు నేతలు సమావేశం అయ్యారంటారా?
కన్నబాబు కాదు. ప్రభుత్వ చర్యలని చూసిన తరువాతే ఆయన దీక్షకి కూర్చొన్నారు. ప్రభుత్వ వైఖరని చూసిన తరువాతే వారు సమావేశమయ్యారు.
ప్రశ్న: రాష్ట్రం జనాభాలో కాపులు సుమారు 26శాతం వరకు ఉన్నారు. వారిని కాంగ్రెస్, వైకాపాలు ఈవిధంగా తమవైపు తిప్పుకొంటే వారి కారణంగానే విజయం సాధించిన తెదేపాకి నష్టం జరుగుతుందంటారా?
కన్నబాబు : కాపులని తెదేపా దూరం చేసుకొంటే దానికే తప్పకుండా నష్టం కలుగుతుంది.
ప్రశ్న: తెలంగాణాలో కెసిఆర్ లాగ ముద్రగడ నేతృత్వంలో కాపులే ప్రత్యేక రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందా?
కన్నబాబు: లేదు. ప్రభుత్వం ఈ సమస్యని సరిగ్గా పరిష్కరించగలిగితే ఇంక ఈ ఉద్యమమే ఉండదు.
ప్రశ్న: ముద్రగడ ఉద్యమం కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏర్పడే అవకాశం ఉందా?
కన్నబాబు: అదిప్పుడే చెప్పలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని ఇలాగే రఫ్ గా హ్యాండిల్ చేస్తే, అప్పుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంతో పోరాడేందుకు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు.
ప్రశ్న: కాపు జేయేసి అనే ఒక మాట ఇప్పుడు తరచూ వినబడుతోంది? దాని అధ్వర్యంలో రాజకీయంగా ముందుకు సాగాలని ఏమైనా అనుకొంటున్నారా?
కన్నబాబు: లేదు. అసలు కాపు జేయేసి గురించి ఇంతవరకు మాట్లాడుకోలేదు.
ప్రశ్న: ఈ సమస్యపై చిరంజీవి అతిగా స్పందించారంటారా?అందరివాడుగా అభిమానం పొందుతున్న ఆయన కాపులకే పరిమితమయినట్లు మాట్లాడటం సబబేనా?
కన్నబాబు: ఇప్పుడు కూడా ఆయన అందరివాడే. ఇటువంటి సమస్య కాపులకే కాదు అందరికీ ఎదురవవచ్చని హెచ్చరించారు. అందుకే అందరూ కలిసి దీనిపై ప్రభుత్వంతో పోరాడాలని పిలుపునిచ్చారు, “ అని చెప్పి కన్నబాబు ఇంటర్వ్యూని ముగించారు.