హైదరాబాద్ తెలంగాణ భవన్లో మరోసారి సంబురాలు. ఫిరాయింపుల పర్వాన్ని వేడుకగా జరుపుకొన్న ఉల్లాసభరితమైన దృశ్యాలు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పట్టించుకోకుండా జరిగిన పార్టీ మార్పుల జాతర వైభవంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత రెండేళ్లుగా ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి.
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, భాస్కర్ రావుతో పాటు కాంగ్రెస్ నేతలు వినోద్, వివేక్ ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్ సభ సభ్యుడైనా గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజీనామా చేయకుండానే పార్టీ ఫిరాయించారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పట్టించుకోలేదు. దీని గురంచి అక్కడ ఎవరూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా రాజీనామా చేయకుండానే పార్టీ ఫిరాయించారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ది మాత్రం వీరికి భిన్నమైన పరిస్థితి. తెలంగాణలో ఆ పార్టీకి ఆయనే ఏకైక ఎమ్మెల్యే. కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించే అవకాశం లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీ వచ్చినా, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకోవడాన్ని తెరాస ఉద్యమ స్థాయిలో చేపట్టింది. టీడీపీని నామమాత్రపు స్థాయికి తెచ్చింది. కాంగ్రెస్ ను కూడా అదే స్థాయికి తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నం చాలా వరకు సఫలమైంది. ఏపీలో వైసీపీ విషయంలోనూ చంద్రబాబు ఇదే పనిచేస్తున్నారు. అక్కడా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
బంగారు తెలంగాణ సాధించాలనంటే ఆర్థిక, రాజకీయ స్థిరత్వం కావాలని కేసీఆర్ ఉద్ఘాటించారు. అంటే ఇతర పార్టీల నుంచి ఇంకా చాలా మంది వలస రావచ్చనే సంకేతం ఇచ్చినట్టు కనిపించింది. ఇప్పటికే తెరాస కారు ఓవర్ లోడ్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముందు నుంచీ ఉన్నవారికంటే ఇప్పుడు అధికారం కోసం వచ్చే వారికే పదవులు దక్కుతున్నాయని బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. అయినా కేసీఆర్ మాత్రం వలసలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇంత మందికి ఏం పదవులు ఇస్తారు? వచ్చే ఎన్నికల్లో ఎలా టికెట్లు ఇస్తారనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే 2019 ఎన్నికల్లో టికెట్ల కోసం రాజకీయంగా భీకర యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదు.