చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పి.మాణిక్యాల రావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ భాజపాకి చెందినవారు. వారిలో డా.కామినేని ప్రభుత్వంలో చాలా చక్కగానే ఇమిడిపోగలిగారు. నిజానికి ఆయన తెదేపా మంత్రుల కంటే కూడా చాలా చక్కగా తెదేపా ప్రభుత్వంలో ఇమిడిపోయి తన ఉనికిని చాటుకోగలుగుతున్నారు. కానీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు మాత్రం ఆయనలాగ ఇమడలేక కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉన్నారు. అందుకు కారణం దేవాదాయ శాఖలో ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు జరిగిపోతుండటం.
గోదావరి పుష్కరాల నిర్వహణ, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం, కృష్ణా పుష్కరాలకి ఏర్పాట్లు వంటి అనేక విషయాలలో ముఖ్యమంత్రి ఆయనని సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొంటున్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఎన్నడూ తన అసంతృప్తిని బయటపెట్టలేదు కానీ నిన్న మొట్టమొదటిసారిగా మంత్రిపదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. తన నియోజక వర్గం తాడేపల్లిగూడెంలో తనకి మాట మాత్రంగానైనా చెప్పకుండా జిల్లా పరిషత్ అధ్యక్షుడు బాపిరాజు అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు మాణిక్యాల రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజినామాకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మిత్రపక్షమైన భాజపా పట్ల తెదేపా నేతలకి చులకనభావం ఉన్నప్పటికీ, మిత్రధర్మం పాటించి సంయమనం పాటిస్తుంటే, తెదేపా నేతలు తమ సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నారని, అది వారికి తగదని మాణిక్యాల రావు అన్నారు.
ఆయన గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యి తన అభిప్రాయాలని చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి తన పార్టీ నేతలని, ఎమ్మెల్యేలని అదుపు చేయగలరు కానీ వారి వైఖరిని మార్చడం కష్టం కనుక ఇటువంటి సమస్యలు మున్ముందు కూడా అప్పుడప్పుడు పునరావృతం అవుతూనే ఉండవచ్చు. కనుక మాణిక్యాలరావు ముఖ్యమంత్రికి పిర్యాదులు చేయడం కంటే డా. కామినేని శ్రీనివాస్ మాదిరిగా తన మంత్రిత్వ శాఖని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకొని దానిపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.