నందమూరి బాలకృష్ణ వందో చిత్రంలో మోక్షజ్ఞ సహాయ దర్శకుడిగా పనిచేయబోతోతున్న సంగతి తెలిసిందే. మొరాకో లో జరిగిన షెడ్యూల్ కి మోక్షజ్ఞ వెళ్లినా..సహాయ దర్శకుడిగా ఎలాంటి బాధ్యతా తీసుకోలేదు. అయితే ఈనెల 20 నుంచి హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ నుంచి ఈ సినిమా చివరి రోజు షూటింగ్ వరకూ… మోక్షజ్ఞ సహాయ దర్శకుడిగా పనిచేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడని ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్యకు ఇది మైలురాయిలాంటి చిత్రం. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇస్తే.. బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట.
అయితే బాలయ్య మాత్రం అందుకు `నో` చెప్పినట్టు తెలుస్తోంది. మోక్షజ్ఞని సహాయ దర్శకుడి పాత్రకే పరిమితం చేయాలన్నది బాలయ్య ఆలోచన. బాలయ్య వందో సినిమాగా ఆదిత్య 999 అనుకొన్నప్పుడు అందులో మోక్షజ్ఞ కోసం ఓ పాత్ర సృష్టించారు. దానికి బాలయ్య కూడా ఓకే అన్నాడు. అయితే.. గౌతమి పుత్రలో అలాంటి అవకాశం లేదని, బలవంతంగా పాత్రల్ని చొప్పిస్తే కథాగమనం దెబ్బతింటుందన్నది బాలయ్య భయం. సో… ఈ సినిమా వరకూ మోక్షజ్ఞ సహాయ దర్శకుడి పాత్రకే పరిమితమవుతాడన్నమాట.