ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక యుద్ధం, దానికి తెరాసకి మద్య సమాంతరంగా మరో యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాదు ఓడిపోయి, రాష్ట్రం నుంచి క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో కూడా కుమ్ములాడుకోగలదని తెలంగాణా కాంగ్రెస్ నేతల కీచులాటలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం టీ- కాంగ్రెస్ స్వీయ వినాశకర స్థితి (సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్)లో ఉన్నట్లు కనబడుతోంది. ఆ ప్రక్రియ మరింత వేగవంతం అవడానికి కాంగ్రెస్ పార్టీపై తెరాస తన ఆకర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి వారి అనుచరులు తెరాసలోకి వెళ్ళిపోయారు. “అందుకు నువ్వే కారణం అంటే కాదు నువ్వే కారణం…నువ్వు బయటకి పో..అంటే కాదు నువ్వు బయటకి పోతేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది,” అని టీ-కాంగ్రెస్ నేతలు తమలో తాము కీచులాడుకొంటున్నారు.
ఆ కీచులాటలో కొందరు జానారెడ్డి వైపు వేలెత్తి చూపడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబద్దతని నిరూపించుకోవడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు. తద్వారా తను కెసిఆర్ తో కుమ్మక్కు అవలేదని నిరూపించుకొనేందుకు ప్రయత్నించారు. జానారెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొన్న కెసిఆర్ ఆయనని ఆదుకోవడానికి తన సహజశైలిలో జానారెడ్డిని చెడామడా తిట్టిపోశారు. అంటే జానారెడ్డితో తనకు రహస్య అవగాహన, స్నేహం వంటివేవీ లేవని నిరూపించడానికనుకోవచ్చు. ఈవిధంగా తిట్టుకోవడం ద్వారా ఒకరినొకరు కాపాడుకొనే ప్రయత్నం చేయడం చాలా విచిత్రంగానే ఉంది. కానీ ఇటువంటి పద్ధతి మన రాజకీయాలలో చాలాకాలం నుంచే ఉన్నాయి.
ఇంతకీ జానారెడ్డి ఏమన్నారంటే “రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ భ్రష్ట రాజకీయాలకి పాల్పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి చేయమని ప్రజలు అధికారం అప్పజెప్పితే ప్రతిపక్షాల నేతలను, ఎమ్మెల్యేలను ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయాలని కెసిఆర్ పగటి కలలుకంటున్నారు. ఆయన నిరంకుశ పరిపాలనని ప్రజలు గమిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు కెసిఆర్ కి గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
ఆయన మాటలకి కెసిఆర్ కూడా అంతే ఘాటుగా జవాబిచ్చారు. రాష్ట్రాన్ని మీ పార్టీయే భ్రష్టు పట్టించింది. మీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలని సరిదిద్దడానికే మాకు రెండేళ్ళ సమయం పట్టిందంటే, మీరు రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టు పట్టించారో అర్ధమవుతోంది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి 10 మంది తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకొన్నప్పుడు మీరు ఆయన పక్కనే ఉన్నారు కదా?2014 ఎన్నికలకి ముందు మా పార్టీ ఎంపి విజయశాంతిని, ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకొన్నారు కదా అప్పుడు అదేమీ మీకు తప్పుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మీవాళ్ళు వచ్చి మా పార్టీలో చేరుతుంటే అన్యాయం, అక్రమం అని గొంతు చించుకొని అరుస్తున్నారెందుకు? మీరు చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే వ్యభిచారమా? మా పార్టీలో చేరికలు చిల్లర మల్లార రాజకీయాలు కావు. తెలంగాణాలో రాజకీయ స్థిరత్వం, అభివృద్ధి కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలు,” అని అన్నారు.