ఎట్టకేలకు తెలంగాణా తెదేపా నేతలు మేల్కొనట్లున్నారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందరూ నిన్న సమావేశమయ్యి పార్టీ పరిస్థితిని సమీక్షించుకొన్నారు. రాష్ట్రంలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఏమి చేయాలో ఆలోచించుకొన్నారు. 2019 ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికని సిద్దం చేసుకొన్నారు. ఇకపై పార్టీ నేతలందరూ సమిష్టిగా పని చేస్తూ, తెరాసని ధీటుగా ఎదుర్కోవాలని నిశ్చయించుకొన్నారు. అందుకోసం భారీ ప్రణాళికని రూపొందించుకొని దానిని అమలుచేయలేక చతికిలపడటం కంటే, దశలవారిగా పార్టీని పునర్నిర్మించుకొంటూ ముందుకు సాగడం మంచిదని నిర్ణయించుకొన్నారు.
అందుకోసం ప్రతీ జిల్లాలో తమకి బాగా పట్టున్న ఆరు నియోజకవర్గాలని ఒక యూనిట్ గా తీసుకొని ఆ ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలని కలవాలని నిర్ణయించుకొన్నారు. అవసరమైన చోట వారిలో నుంచి ద్వితీయశ్రేణి నాయకులుగా ఎదిగే శక్తిసమర్ధ్యం ఉన్నవారికి అన్ని విధాల ప్రోత్సహించి, సహాయసహకారాలు అందించాలని నిర్ణయించారు. పార్టీలో సీనియర్ నేతలు అందరూ తరచూ ఆ నియోజక వర్గాలలో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో అనుసంధానం అయ్యుండాలని నిర్ణయించుకొన్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ వారు తమ లక్ష్యాన్ని సాధించేందుకు “2019లో రామరాజ్యం” అనే నినాదంగా పెట్టుకోవడమే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రామరాజ్యం అంటే వారి ఉద్దేశ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ నాటి రాజ్యం అయ్యుండవచ్చు. కానీ రామరాజ్యం పేరు చెప్పగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది భాజపాయే. అది అయోధ్య రామాలయం పేరుతో రాజకీయాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి రాముడి పేరుతో ఎవరు నినాదం చేసినా అందరూ అది భాజపాయే అని అనుకొంటారు. తెలంగాణాలోనే భాజపా కూడా ఉంది. కానీ ఇప్పుడు దానితో తెదేపాకి పొత్తులు లేవు. మరి ఆ పేరేమిటి? ఎందుకు?
తెదేపా భాజపాతో జత కట్టినప్పటికీ దాని సెక్యులర్ ముద్ర ఇంకా పదిలంగానే ఉంది. కనుక తెదేపా రామరాజ్యం అనడం చాలా అసంబద్ధంగా ఉంది. అయితే తెదేపా నేతలందరూ నిజంగానే పట్టుదలగా చిత్తశుద్ధితో కార్యాచరణకి దిగితే ఆ నినాదం గురించి పెద్దగా పట్టించుకొనవసరం లేదు. వారి సమిష్టి కృషే అ పార్టీని నిలబెట్టగలదు. కానీ తెదేపా నేతల మాటలని చేతలలోకి మార్చి కష్టపడగలరా? అధికార తెరాస ధాటికి తట్టుకొని నిలబడగలరా? అనే సందేహాలున్నాయి. వారు తమ రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదు. అంత కష్టం తమ వల్లకాదనుకొంటే అందరూ వెళ్లి తెరాసలో చేరిపోవడమే సులువైన మార్గం.