సినిమాల్లోనూ టీవీ సీరియల్స్ తదితర కథనాల్లోనూ అసభ్యతను ఒక ఆకర్షణగా వాడుకోవడం మామూలే. జబర్దస్త్ వంటి వాటి సంగతి చెప్పనే అవసరం లేదు. కాని రాజకీయ చర్చల్లో కూడా కొంతమంది అదే ఫార్ములా వాడుతున్నారా? బాగా మాట్లాడగల నాయకులు కూడా కావాలనే ఎబ్బెట్టయిన పదాలతో ఇబ్బంది పెడుతున్నారా? అంతేగాక సహజత్వం పేరుతో కొంతమంది అర్ధబూతులు వాడటం మరింత అసహ్యంగా వుంటున్నది.
వైసీపీ ప్రతినిధి మాజీ ఎంఎల్ఎ అంబటి రాంబాబు.. అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. గుక్క తిప్పుకోకుండా అవతలివారిపై విరుచుకుపడుతుంటారు. అయితే భాష మీద పట్టు వున్నవారు. అలాటి నాయకుడు బుథవారం టీవీ5 చర్చలో పదే పదే ఒక పదాన్ని పట్టుకుని చికాకు పెట్టారు. తిరుపతి మహానాడులో ఒక మహిళ చంద్రబాబుకు ఏదో చూపించిందని చదివాం. ఏం చూపించిందండీ అని ప్రశ్నించారు. ఈ చర్చలో కనీసం అయిదారు సార్లు ఈ మాటనే ఏం చూపించింది ఏం చూపించింది అనడంతో ప్యానలిస్టులు, ప్రెజంటర్ కూడా చాలా ఇబ్బందిపడిపోయారు. చెప్పులో చీపురో చూపించిందనుకుంటే రాంబాబు నేరుగా చెప్పి వుండొచ్చు. లేదా నిరసనసూచన అని చెప్పొచ్చు. కాని వద్దని వారిస్తున్నా అనేక సార్లు ఆ విధంగానే మాట్టాడ్డం జుగుప్స కలిగించింది.
ఎన్టివి చర్చలో కాంగ్రెస్ ప్రతినిధి శ్రావణ్ కూడా గురువారం ఇలాగే ఇబ్బంది పెట్టారు. మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అన్న కెసిఆర్ మాటను తీసుకుని వ్యభిచారం అన్న పదాన్ని పదిసార్లు పలికారు. యాంకర్ వద్దని చెప్పినా ఆయన అన్నదే నేను అంటున్నా అంటూ అదే ధోరణి కొససాగించారు. చర్చలో వున్న ఒక మహిళా నేత కూడా ఇది బాలేదు అన్నా పట్టించుకోలేదు. తర్వాత తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే మాట పట్టుకుని మళ్లీ మళ్లీ అంటూ మరో వాదన చేశారు.కొన్నిసార్లు అనుకోకుండా పొరబాట్లు దొర్లవచ్చు గాని కావాలని ఎబ్బెట్టయిన ప్రయోగాలు చేయకుండా వుంటే మంచిది.