వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వాటి కోసం కాంగ్రెస్, భాజపాలు అప్పుడే ఏదో వంక పేరు పెట్టుకొని ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని నిలపాలని భావిస్తోంది. అందుకు ఆయన కూడా సిద్దంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే పార్టీ విజయావకాశాలు బాగుంటాయని ఆ పార్టీకి ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా సేవలందిస్తున్న ప్రశాంత్ కిషోర్ సూచించారు. డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆమెని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్-ఛార్జ్ గా నియమించబోతున్నట్లు తాజా సమాచారం.
కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ ఎన్నికల ఇన్-చార్జ్ గా మొదట మాజీ కేంద్రమంత్రి కమల్ నాథ్ ని నియమించింది. కానీ ఆయన 1984 డిల్లీ సిక్కుల ఊచకోత కేసులో నిందితుడుగా ఉన్న సంగతి మరిచిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరు ప్రకటించిన వెంటనే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తో సహా అన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. జరిగిన్ పొరపాటుని దాని వలన కలిగే నష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనని వెంటనే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన స్థానంలో షీలా దీక్షిత్ ని నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డిల్లీ ముఖ్యమంత్రి సుదీర్గ కాలంపాటు పనిచేసిన ఆమెకి పంజాబ్ లో మంచి పేరుంది. పంజాబ్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలతో, ప్రజలతో ఆమెకి మంచి పరిచయాలే ఉన్నాయి. కనుక ఆమెని పంజాబ్ ఎన్నికల ఇన్-చార్జ్ గా నియమించవచ్చని తాజా సమాచారం.
ఒకవేళ ఆమెని పంజాబ్ ఇన్-ఛార్జ్ గా నియమిస్తే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారో త్వరలోనే తెలియవచ్చు.