వైకాపా అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేల వలసలని ఆపలేక చాలా ఇబ్బందిపడుతోంది. నిన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో కలిపి ఇప్పటివరకు మొత్తం 20మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయారు. వారు వెళ్ళిపోవడం వలన పార్టీకి కలుగుతున్న నష్టమే కాకుండా అంతవరకు వారు పార్టీలో నిర్వహిస్తున్న కీలక పదవులలో వేరొకరి నియామకం కూడా ఒక సమస్యగా మారిపోయింది.
భూమానాగి రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోయిన తరువాత ఆయన ఖాళీ చేసిన పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని సీనియర్ నేత జ్యోతుల నెహ్రు ఆశించారు. కానీ ఆ పదవిని బుగ్గన రాజేంద్రరెడ్డికి కట్టబెట్టడంతో జ్యోతుల నెహ్రు పార్టీపై ఆగ్రహించి తెదేపాలోకి వెళ్లిపోయారు. అందరూ ఆయనలాగ అలిగి పార్టీని విడిచి వెళ్లిపోకపోయినా, ఖాళీ అవుతున్న పదవుల కోసం పార్టీలో నేతల మద్య పోటీ ఏర్పడుతోంది. దాని వలన పార్టీ అధిష్టానానికి తల నొప్పులు తప్పడం లేదు. ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్ళిపోగానే ఈ సమస్య కూడా వెంటనే తలెత్తుతోంది. తప్పనిసరిగా దానిని పరిష్కరించవలసి వస్తోంది.
వివిధ జిల్లాలలో పార్టీ అధ్యక్షులు, ఇన్-చార్జ్ లు తెదేపాలోకి వెళ్లిపోవడంతో వారి స్థానాలలో మళ్ళీ కొత్తవారిని నియమించవలసి వచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బి. సురేష్ గౌడ్, అధికార ప్రతిబ్నిదిగా పి. గౌతం రెడ్డిని నియమించారు. ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డిని నియమించారు. జిల్లాలో అద్దంకి నియోజక వర్గ ఇన్-చార్జ్ గా మాజీ ఎమ్మెల్యే బి.సి. గరటయ్యని, కదిరి ఇన్-చార్జ్ గా పివి సిద్దార్హా రెడ్డిని, నరసాపురం కన్వీనర్ గా ముదునూరి ప్రసాదరాజుని నియమించారు.