జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడయిన రాహుల్ గాంధీ ఎక్కడ…ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న అనేక విద్యార్ధి జెఎసిలలో ఒక జెఎసికి అధ్యక్షుడయిన బలరాజ్ యాదవ్ ఎక్కడ? అతను రాహుల్ గాంధీ అంతటి వాడిని పట్టుకొని ఎంత మాటనేశాడు? రాహుల్ గాంధీ ఒక రాజకీయ నిరుద్యోగిట! అందుకే మళ్ళీ తెలంగాణాలో చక్కర్లు కొడుతున్నారుట!
ఆనాడు సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్దులు, యువకులు బలిదానాలు చేసుకొన్నా ఉస్మానియా వైపు కానీ, తెలంగాణా వైపు గాని తొంగిచూడని రాహుల్ గాంధీకి ఇప్పుడు ఉస్మానియా విద్యార్ధులతో ఏమి పని? ఎందుకు రావాలనుకొంటున్నారు? అంటే మళ్ళీ అదే సమాధానం చెప్పుకోవలసివస్తుంది. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టేముందు తెలంగాణా ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనను లోన అడుగుపెట్టనీయబోమని టీ.యస్.జెఎసి అధ్యక్షుడు బలరాజ్ యాదవ్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణా ఉద్యమాలకి తమ ఉద్యమాలతో, బలిదానాలతో ఊపిరి పోసిన ఉస్మానియా విద్యార్ధులే కొందరు డిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడటాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. తెలంగాణ కోసం విద్యార్ధులు, యువకులు బలిదానాలు చేసుకొంటున్నా కించిత్ చలించని సోనియా, రాహుల్ గాంధీలు ఇప్పుడు తెలంగాణా ప్రజల కష్టాలు, ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతుల గురించి కన్నీళ్లు కార్చడం విడ్డూరంగా ఉందని ఆయన వారిని ఎద్దేవా చేసారు. కానీ తమ నాయకుడిని ఉస్మానియాలో అడుగుపెట్టకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు.