ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కొత్తగా కొన్ని రైల్వే ప్రాజెక్టులు, రైల్వేజోన్ వగైరా సాధించడానికి చాలా తెలివిగా వ్యవహరిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి తెదేపా తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు కేటాయించారు. దానితో ఆయనకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన భాద్యతని అప్పగించినట్లయింది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయిన వెంటనే చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రాజధాని అమరావతికి కొత్తగా రైల్వే లైన్ నిర్మాణ పనులు, మరి కొన్ని ఇతర ప్రాజెక్టులకి పచ్చ జెండా ఊపారు. గత రెండేళ్ళుగా నానుతున్న రైల్వేజోన్ ఏర్పాటుకి కూడా ఆమోదం తెలిపినట్లు తాజా సమాచారం. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ ఈస్ట్ కోస్ట్ (ఆగ్నేయ కోస్తా రైల్వే జోన్) ని ఏర్పాటు చేయడానికి రైల్వే బోర్డులో చకచకా పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రతిపాదనకి రైల్వే బోర్డులో ఆపరేషన్స్ విభాగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తాజా సమాచారం. ఈ నెల 21న యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు విశాఖపట్నం వస్తున్నారు. ఆ రోజు ఆయన దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన ఈ హామీని నెరవేర్చగలిగితే కేంద్రంపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం చల్లారుతుంది. ఈ హామీ అమలు చేయనందుకు ఇంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు తెదేపా గట్టిగా సమాధానం చెప్పడానికి వీలవుతుంది. అలాగే కేంద్రప్రభుత్వం హామీలు అమలుచేయడం లేదని, రాష్ట్రానికి సహకరించడం లేదని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తెదేపా నేతలకి రాష్ట్ర భాజపా నేతలు కూడా గట్టిగా సమాధానం చెప్పుకోగలుతారు. తమ పోరాటాలతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైల్వేజోన్ సాధించుకొన్నామని ప్రతిపక్షాలు కూడా క్రెడిట్ క్లెయిం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కనుక దీని వలన అందరికీ లాభం, సంతోషం కలుగుతుంది కనుక ఈ కధ సుఖాంతం అవుతుంది.