కథల జడ్జిమెంట్ అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో, ఏది తుస్సుమంటుందో ముందే చెప్పలేం. అలా చెప్పగలిగితే… అందరూ హిట్ సినిమాలే చేసేవాళ్లు కదా? ఈ సినిమా హిట్టవుతుంది కదా అనే ఆశతో సినిమా చేస్తే.. అది పల్టీ కొట్టొచ్చు. ఈ సినిమా వర్కవుట్ అవ్వదులే అని వదిలేస్తే.. ఆ కథే సూపర్ హిట్టయిపోవొచ్చు. అయితే నవతరం హీరోల్లో కథలపై శర్వానంద్‌కి మంచి జడ్జ్మెంట్ ఉంది. మంచి కథలనే ఎంచుకొంటాడన్న ఇమేజ్ ఉంది. అయితే తొలిసారి శర్వానంద్ ఓ సినిమా విషయంలో పొరపడ్డాడు. ఈ సినిమా ఆడదేమో అన్న భయంతో… ఓ బంపర్ ఆఫర్ వదులుకొన్నాడు. తీరా ఆ సినిమా వేరే హీరో చేసేశాడు.. బయటకు వచ్చింది…. హిట్టు కూడా అయిపోయింది. ఆ సినిమానే జెంటిల్మెన్.
నాని – ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న సినిమా జెంటిల్మెన్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మంచి అప్లాజ్ వస్తోంది. నాని హిట్ చిత్రాల జాబితాలో దీనికీ స్థానం కల్పించారు విమర్శకులు. బాక్సాఫీసు దగ్గర కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కే అవకాశాలున్నాయి. అయితే ఈ కథ నానికి చెప్పకముందే.. శర్వానంద్ దగ్గరకు వెళ్లిందట. ఇంద్రగంటి తో సినిమా చేయడానికి శర్వా ఉత్సాహం చూపించినా… కథ అంతగా ఎక్కలేదట. అందుకే.. శర్వా మొహమాటం లేకుండా నో చెప్పాడని టాక్. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసి… మనసులో ఎంత బాధపడుతున్నాడో?