ఏరాజకీయ పార్టీ మీదా ప్రత్యేకమైన ఇష్టమూ, అయిష్టమూ లేని తటస్ధులు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భారాన్ని మోస్తున్న చంద్రబాబు నాయుడు పట్ల కొంత సానుభూతితో, కొంత ఆశాభావంతో ఇప్పటికీ వున్నారు. అయితే సమధర్మం పాటించని పాలనను వ్యతిరేకిస్తున్నారు. ముద్రగడ డిమాండ్ సహేతుకంగా లేకపోయినా కూడా ఆయన క్రెడిడ్ ని కాజేయడానికి తెలుగుదేశం పూనుకుందని, అందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుందని ప్రజలు నమ్మడం వల్లే ఈ ఇష్యూలో ప్రభుత్వానికి బహిరంగ మద్దతు సానుభూతి లభించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సోషల్ మీడియాలో విమర్శ వస్తే లైక్ మార్క్ చేయడం ద్వారా దాన్ని ఆమోదించే వారి సంఖ్య పెరిగిపోతున్నది. వీరిలో తెలుగుదేశం వ్యతిరేకుల కంటే తటస్ధుల సంఖ్యే ఎక్కువగా కనబడుతూండటం గమనార్హం!
ఇది బాబు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు నిండిన హానీమూన్ దశ ముగియడం వల్ల మాత్రమే కాదు. అనేకానేక ఇతర చిన్నా పెద్దా కారణాలతోపాటు పాలనలో సమధర్మం దెబ్బతింటున్నదనీ, ఎవరికైనా ఒకే న్యాయం లోపిస్తున్నదనీ సామాన్య లేదా తటస్ధ ప్రజానీకం భావిస్తూండటమే ముఖ్యమంత్రి పై విమర్శలకు మద్దతు పెరుగుతున్న కారణాలలో ముఖ్యమైనది.
గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారు. విఐపి ఘాట్ వదిలేసి పుష్కరఘాట్ లో ముఖ్యమంత్రి దాదాపు రెండుగంటలు వుండిపోవడమే ప్రమాద కారణమన్న విమర్శలు వచ్చాయి. దీనిపై న్యాయవిచారణకు ఆదేశించారు. ఇది ముఖ్యమంత్రి తన మీద నిందాభారం తగ్గించుకోడానికి మాత్రమే వుపయోగపడింది. కమీషన్ కి అధికారులు సహకరించడంలేదు. కమీషన్ రెండేసి సార్లు అడిగితే కాని అఫిడవిట్లు కూడా వెయ్యడం లేదు. వేసినా వివరాలు వుండటం లేదు. మాజీ ఎంపి వుండవల్లి అరుణ్ కుమార్, న్యాయవాది ముప్పాళ సుబ్బారావు క్రమం తప్పకుండా వాయిదాలకు హాజరౌతూ ఫాలో అప్ చేస్తూ వుండకపోతే సాక్షులు ఎవరూ రానందువల్ల విచారణ ముగిసిందని కమీషన్ ఈ పాటికే ప్రకటించి వుండేదే!
విజయవాడలో కాల్ మనీ రాక్షసులు డబ్బు వసూళ్ళ కోసం అప్పుతీసుకున్నవారి కుటుంబాల స్త్రీలు కొందరిని బ్లాక్ మెయిల్ చేసి బ్లూఫిలిమ్స్ తీసి హింసించారు. ఇది బయటపడగానే ముఖ్యమంత్రే రంగంలోకి దిగిపోయారు. ఆ దుర్మార్గులపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి శిక్షింపజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాల్ మనీ వ్యాపారాలపై దాడులు చేయించారు. దీన్ని అవకాశంగా తీసుకుని బాకీలు ఎగవేయడానికి అనేకచోట్ల రుణగ్రహీతలే తప్పుడు కేసులు పెట్టి వ్యాపారులను ఇబ్బంది పెట్టారు. అప్పు పుట్టని పరిస్ధితి తెచ్చారు. విజయవాడ నేరగాళ్ళలో సొంత సామాజిక వర్గం వారి తప్పుని చిన్నగా చూపడానికే రాష్ట్రవ్యాప్త దాడులు జరిగాయన్న విమర్శలకు రుజువుగా నేరగాళ్ళు బెయిలుపై తిరుగుతున్నారు. నిర్భయ కేసు నమోదై వుంటే బెయిలు వచ్చే అవకాశం లేదు.
ఆరునెలల్లో కాపులకు బిసిల రిజర్వేషన్ హామీతో అంటే కొరివితో తలగోక్కున్నంత సాహసం. అన్నీ తెలిసిన చంద్రబాబు ఎలాగైనా గెలవడమే ముఖ్యమని చంద్రబాబు ”రిజర్వేషన్ తో జుట్టుగోక్కున్నారు”. ఏడాదిన్నర వేచి చూసిన ముద్రగడ పద్మనాభం ఆ జుట్టు అందుకున్నారు.ఆయన జగన్ ఏజెంటని ముద్రవేసే పనిని తెలుగుదేశం మొదలు పెట్టింది. బాబు ఇచ్చిన హామీ అమలు చేయాలన్న డిమాండుని పక్కన పెట్టి ఇందులో జగన్ ప్రభావం వుందన్న నీచమైన ప్రచారానికి తెగబడ్డారు. ఒక వేళ జగన్ ప్రభావం వుంటే మాత్రం ఏమిటి? ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేయడం తప్పా? ముద్రగడ సభ పెట్టారు. ఆందోళనకారులు రైళ్ళు తగలబెట్టారు. ముద్రగడ దీక్షకు కూర్చున్నాకే రిజర్వేషన్ల హామీలో కదలిక వచ్చింది.
ఈ ప్రాసెస్ లో వచ్చే కీర్తి ప్రతిష్టలు ముద్రగడకు దక్కకూడదనుకున్నారు. ఒక వైపు ఆయన మీద విమర్శలు పెంచుతూ మరోవైపు ”ఇదే అనువైన సమయమని” కేసులు బిగించడం మొదలుపెట్టారు. ముద్రగడ మౌనంగా వుండిపోతే అనుచరుల నుంచి ఏకాకిగా మార్చేసే అధికారపార్టీ ఎత్తుగడ సఫలమై వుండేదే! ముద్రగడ తన పద్ధతిలో మళ్ళీ దీక్ష మొదలుపెట్టడంతో కథ అడ్డం తిరిగింది. భద్రత పేరుతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని జైలుగా మార్చేసి రోగులు వారి కుటుంబాలను కిలోమీటర్లకొద్దీ నడిపించి నరకయాతనపెట్టారు. విలేకరులకు దరిదాపుల్లో ప్రవేశమే లేకుండా చేశారు. పనిలో పనిగా సాక్షి టివి ప్రసారాలను నిలిపివేయించారు. భయాందోళనలు కలిగించే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున ఈ చర్య తీసుకున్నామని హోం మంత్రి స్వయంగా ప్రకటించారు.
ఒక వైపు ముద్రగడ మెట్టుదిగకపోవడం, మరోవైపు ఎవరికి వారుగా వున్న కాపు పెద్దలంతా ముద్రగడకు మద్దతుగా ఏకం కావడం తో ప్రభుత్వమే దిగిరావలసి వచ్చింది. రాజకీయనాయకులతో సమానంగా జిల్లా కలెక్టర్ ముద్రగడతో మధ్యవర్తిత్వం నెరపవలసి వచ్చింది. మధ్యలో మంత్రుల పుల్లవిరుపు మాటలు… దిగి వచ్చిన ముద్రగడ దీంతో ప్రభుత్వానికి టెర్మ్స్ డిక్టేట్ చేసేస్ధితికి మళ్ళీ చెట్టెక్కారు.
సంఘటన జరిగిన వెంటనే అరెస్టులు చేసినా సమస్య వుండేదికాదు. మంజునాధ్ కమీషన్ నివేదిక వచ్చాక మా బాధ్యత పూర్తి చేశాం అని చేతులు దులిపేసుకుని అరెస్టులు చేసినా అడిగేవారు వుండరు. ఉద్యమలబ్ది ముద్రగడకు దక్కకూడదన్న ఏకైక లక్ష్యంతో ఎటూగాని సమయంలో అరెస్టులు చేయడం వల్లే ప్రభుత్వం ముద్రగడకు సరెండర్ అయిపోయిందన్న వాతావరణం ఏర్పడింది.
రాజకీయపార్టీలు రాజకీయాలే చేస్తాయి. రాజకీయప్రయోజనాలకోసం అధికారాన్ని వాడేసుకుంటే పరిస్ధితి ఇలాగే వుంటుంది. ఆకేసులో ఇలాగే చేశారా?…పాతకేసులను తొక్కేసి దీన్నే ఎందుకు పైకి తెచ్చారు… ఇలాంటి ప్రశ్నలే వస్తాయి.
ప్రతీ ఒక్కరూ ప్రశ్నలు అడగరు! ఎవరు అడిగినా, అది తమ మనసులో వున్న భావానికి దగ్గరగా వుంటే సంఘీభావాన్ని ప్రకటిస్తారు. అదే సోషల్ మీడియాలో వున్న మేజిక్. ఈ సందర్భంలో ఒక పార్టీకి అనుకూల, వ్యతిరేక వాదనలు కూడా అనివార్యమౌతాయి. హీట్ పెరిగితే వ్యక్తుల మధ్య దూషణలుగా మారుతాయి. అయితే కామెంట్లేమీ చేయని తటస్ధుల లైక్ లు మాత్రమే జనాభిప్రాయానికి అద్దం పడతాయి. ఈ విశ్లేషణకు జతపరచిన ఒక ఫేస్ బుక్ అప్ డేట్ స్క్రీన్ షాటే ఇందుకు ఒక ఉదాహరణ! ఈ పోస్టుని గంటలోనే 19 మంది వారివారి టైమ్ లైన్ మీద షేర్ చేసుకున్నారు. 123 మంది లైక్ ద్వారా సంఘీభావం ప్రకటించారు.