హైదరాబాద్ ను పారిశ్రామిక ప్రపంచ పటంలో చేర్చిన అరుదైన, అతిపెద్ద కంపెనీల్లో ఒకటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. క్లుప్తంగా ఇ.సి.ఐ.ఎల్. హైదరాబాదులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు, ఈ ప్రాంతం పేరు వినని వారి బహు అరుదు. ఒకప్పటితో పోలిస్తే ఈ కంపెనీలో ఉత్పత్తుల సంఖ్య తగ్గినా, రక్షణ రంగంలో మాత్రం కీలక ఉత్పత్తులు చేస్తూనే ఉంది. ఈ సంస్థ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలూ సొంతమయ్యాయి. తాజాగా 2016 సంవత్సరానికి ఉత్తమ పరిశ్రమగా అవార్డు గెల్చుకుంది.
భారత బ్రహ్మాస్త్రంగా పిలిచే అత్యద్భుతమైన క్షిపణి బ్రహ్మోస్. దీని తయారీకి సాంకేతిక విభాగంలో గొప్ప సేలవు అందించిన సంస్థ ఇసిఐఎల్. బ్రహ్మోస్ కంట్రోల్ సిస్టం, గ్రౌండ్ కంట్రోల్ సిస్టంల ఏర్పాటులో ఈ సంస్థదే కీలక పాత్ర. క్షిపణిని తయారు చేసింది డిఆర్ డిఒ. అయితే పలు సాంకేతిక అంశాల్లో సహకరించింది మాత్రం ఇసిఐఎల్.
ఈ కంపెనీ కీర్తికిరీటంలో ఓ కలికితురాయి ఉంది. జనాభాపరంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ప్రజాస్వామ్యానికి కీలకమైన పరికరాల తయారీ జరుగుతున్నది ఈ సంస్థలోనే. అవే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు. దేశ వ్యాప్తంగా పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా, ఎన్ని లక్షల ఇ.వి.ఎం.లు అవసరమైనా సరఫరా చేసే సంస్థ ఇదే. ఆ విధంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఘనమైన స్థానం పొందింది. పైగా ఎక్కడా ఓట్ల విషయంలో తేడా రాకుండా అత్యంత పకడ్బందీగా, సాంకేతికంగా పక్కాగా అంత పెద్ద సంఖ్యలో ఓటింగ్ యంత్రాలను తయారు చేయడం మామూలు విషయం కాదు.
హైదరాబాద్ కుషాయిగూడ ప్రాంతంలో 1967లో ఈ కంపెనీ ప్రారంభమైంది. డాక్టర్ ఎ ఎస్ రావు ఈ కంపెనీకి తొలి ఛైర్మన్. కేంద్ర అణు ఇంధన విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుతం దాదాపు మూడు వేల మంది నిపుణులైన ఇంజినీర్లు, టెక్నీషియన్లు ఇందులో పనిచేస్తున్నారు. ఒకప్పుడు మరిన్ని ఉత్పత్తులో ఈ కంపెనీ పేరు మోతమోగేది. ఇ.సి. టీవీ అంటే పెట్టింది పేరు. ప్రయివేట్ కంపెనీల టీవీల కంటే ధర తక్కువ నాణ్యత ఎక్కువ అని పేరు పొందింది. రానురానూ ప్రయివేట్ కంపెనీల ప్రచారం, తదితర కారణాల వల్ల ఈసీ టీవీలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో వాటి ఉత్పత్తికి బ్రేక్ పడింది. అయినా రక్షణ రంగంలో సాంకేతిక అందించే విషయంలో మాత్రం ఈ కంపెనీ ముందుంది.
హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను మార్చిన అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇసిఐఎల్ చాలా ముఖ్యమైంది. దీనిపై ఆధారపడి కుషాయిగూడ ప్రాంతంలో ఓ పెద్ద ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ ఉంది. అందులోని వందలాది చిన్నతరహా పరిశ్రమలను పోషించే సంస్థ ఇసిఐఎల్. అలా పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిస్తోంది.