పవన్ సినిమా నుంచి సూర్య తప్పుకోవడం షాకిచ్చే విషయమే! అయితే పవన్ సినిమాల్లో ఇదంతా మామూలే. దర్శకుల్ని మార్చడం తనకు కొత్తేం కాదు. సంపత్ నందిని తీసేసి.. బాబిని పెట్టుకొన్నాడు సర్దార్ కోసం. ఇప్పుడూ అదే జరిగింది. అయితే ఈసారి ఆఖరి క్షణాల్లో నిర్ణయం తీసుకొన్నాడు అంతే తేడా. మహేష్ సినిమాలో నటించడం కోసమే సూర్య ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడని చిత్రబృందం చెబుతున్నా ఆ విషయం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే… మహేష్ సినిమాలో సూర్యకి ఆఫర్ వచ్చిందన్న సంగతి పవన్‌కి ముందే తెలుసు. కేవలం నటుడిగా వచ్చిన అవకాశం కోసం పవన్‌కి దర్శకత్వం వహించే ఛాన్స్ సూర్య వదులుకోడు. అయితే తెర వెనుక ఏం జరిగి ఉంటుంది?
నిజానికి ఈ ప్రాజెక్టు సూర్య చేతిలో పెట్టడం చాలామందికి మింగుడు పడలేదు. ఎందుకంటే… ఖుషీ సినిమాని మినహాయిస్తే దర్శకుడిగా సూర్య సృష్టించిన అద్భుతాలేం లేవు. దానికి తోడు పవన్‌తో తీసిన పులి ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. సర్దార్ – గబ్బర్‌సింగ్ తరవాత పవన్ కాస్త ఆచి తూచి అడుగేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి దశలో సూర్యతో సినిమా చేయడం ఏమాత్రం మంచిది కాదు. దానికి తోడు పవన్‌కీ – సూర్యకి ఈ మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చేసిందని టాక్. షూటింగ్ మొదలెడదాం.. అని సూర్య తొందర పెడుతుంటే, చూద్దాం, చేద్దాం – అంటూ పవన్ దాటేస్తున్నాడట. దాంతో సూర్య కాస్త అలిగాడని సమాచారం. ఇదే అదునుగా.. పవన్ సూర్యనిపక్కన పెట్టేసినట్టు టాక్. అదీ… సూర్య డ్రాప్ వెనుక ఉన్న కహానీ!