అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఆర్లాండో నైట్ క్లబ్ పై దాడి తరువాత ముస్లింలకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ప్రజాధారణ శాతం కొంత తగ్గింది. ట్రంప్ వెంటనే నష్ట నివారణ ప్రయత్నాలు చేశారు కానీ దాని వలన తన వైఖరికి మొగ్గు చూపుతున్నవాళ్ళని కూడా దూరం చేసుకొన్నట్లవుతుందని గ్రహించినట్లే ఉన్నారు. అందుకే మళ్ళీ యధాప్రకారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
ఆర్లాండో వంటి ఘటనలు పునరావృతం కాకూడదనుకొంటే, పౌరుల దేశం, రంగు, జాతి, మతం, బాషలని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అన్నారు. దానినే ఇంగ్లీషులో రేషియల్ ప్రొఫైలింగ్ అంటారు. ఈ పద్ధతి ఇప్పటికే ఇజ్రాయిల్ దేశంలో అమలులో ఉందని, దానినే అమెరికాలో కూడా అమలుచేయడానికి అభ్యంతరం ఎందుకని ట్రంప్ ప్రశ్నించారు.
ఆ విధానం అమలైతే పౌరుల జాతి, మతం, బాష, దేశం వగైరాలను బట్టి వారు నేరస్తులా కాదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అంటే అమెరికా పౌరస్వతం కలిగి అక్కడే స్థిరపడినప్పటికీ భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల ప్రజలను, ఆ దేశంలో స్థిరపడి ఉన్న ముస్లింలను, నల్లజాతి వారిని నేరం చేసే అవకాశం ఉన్నవారిగా పరిగణించి, ఆ కోణంలో నుండే దర్యాప్తు, కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది.
అమెరికా భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు, నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమే కానీ వేరే దేశానికి, మతానికి, జాతికి చెందిన వాళ్ళందరూ నేరస్తులే అన్నట్లుగా విభజన రేఖ గీయడం వలన ప్రజల మధ్య దూరం పెరిగి ఇంకా అశాంతి పెరగవచ్చు. ఇప్పటికే అమెరికాలో నల్లజాతి వారు తాము తీవ్ర వివక్షకి గురవుతున్నామనే అభిప్రాయంతో ఉన్నారు. ట్రంప్ కోరుతున్నట్లుగా ఒకవేళ దేశంలో మిగిలిన మతాలు, జాతుల, దేశస్థులని నేరస్తులనే దృష్టితో అనుమానంగా చూడటం మొదలుపెడితే, సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ట్రంప్ చేస్తున్న ఇటువంటి సూచనల పట్ల అమెరికాలో సుమారు 40-42 శాతం మంది ప్రజలు ఆమోదం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆలోచనలకి, అభిప్రాయాలకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య ఇంకా పెరిగితే, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజాభిప్రాయానికి అద్దం పడుతున్నవిగానే భావించవలసి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యి తన ఈ ఆలోచనలను అమలుచేయడం మొదలుపెడితే అమెరికా ఊహించని కొత్త సమస్యలను సృష్టించుకొన్నట్లవుతుంది.