ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష నేటితో 12వ రోజుకి చేరుకొంది. ఆయన షరతులకి ప్రభుత్వం అంగీకరించడంతో, కాపు నేతలు, బంధువుల ఒత్తిడి కారణంగా నాలుగు రోజుల క్రితం ఆయన వైద్య పరీక్షలు చేయించుకొని ఫ్లూయిడ్స్ ఎక్కించుకొన్నారు. కానీ తుని కేసులో అరెస్టయిన వారినందరినీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆయన మళ్ళీ తన నిరాహార దీక్షని కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని వైద్యులు ప్రకటించారు.
ఇటీవల కాలంలో ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన రాజకీయ నాయకుడు మరెవరూ లేరనే చెప్పవచ్చు. కానీ ఇంత వయసులో, అన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముద్రగడ 11 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉండటం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్ని రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం ఆయన పట్ల కటినంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది.
ఇదివరకు ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఈవిధంగానే చాలా కటినంగా వ్యవహరించింది. చివరికి వైకాపా నేతలే జగన్ దీక్షని భగ్నం చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ గండం నుంచి గట్టెక్కినట్లు గుసగుసలు వినిపించాయి. కనుక ముద్రగడ తనంతట తాను దీక్ష విరమించడానికి అంగీకరించేవరకు ఆయనపై ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు గానీ కాపు సంఘాల నేతలు గానీ ఎవరూ ఒత్తిడి చేయకుండా రాజమండ్రి ఆసుపత్రిని పోలీసులతో పూర్తి దిగ్బంధం చేసినట్లు అనుమానం కలుగుతోంది. కానీ అదే సమయంలో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటే అందుకోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు స్పష్టం అవుతోంది.
11 రోజులుగా దీక్ష చేసినా ప్రభుత్వం దానిని విరమింపజేసేందుకు గట్టిగా ప్రయత్నించకపోవడంతో ముద్రగడని నిరాశ నిస్పృహలు, నిసత్తువ ఆవరించినట్లు అయన సమీప బంధువుల మాటలని బట్టి తెలుస్తోంది. ఆయన దీక్షకి కూర్చొనే ముందు అందరినీ కలిసి వచ్చినా, ఇప్పుడు ఎవరూ ముందుకువచ్చి ఆయనని ఈ గండం నుంచి గట్టెకించడానికి ప్రయత్నించకపోవడం, ఆయనకి చాలా నిరాశ కలిగించి ఉండవచ్చు.
ఆయనకి దీక్షకి సంఘీభావం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితులలో ఆయనకి అండగా నిలబడకుండా తన కుటుంబంతో కలిసి లండన్ విహారయాత్రకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన దీక్షని విరమింపజేసేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయలేదు. దాసరి, చిరంజీవి, బొత్స, అంబటి తదితర నేతలు సమావేశం అయ్యి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు తప్ప ఎవరూ వెళ్లి ముద్రగడని కలిసేందుకు ప్రయత్నించలేదు. ఏమంటే ఆయనని కలవకుండా పోలీసులు తమని అడ్డుకొంటారు కదా? అనే సంజాయిషీ వారి వద్ద ఉంది.
అందరూ ఆయన దీక్ష గురించి మాట్లాడుతూ తద్వారా రాజకీయ మైలేజి పొందాలనే ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఆయన దీక్షని విరమింపజేయడానికి గట్టి ప్రయత్నాలు చేయడం లేదు. రాజకీయ పార్టీల, వాటి నేతల ఈ తీరు చూస్తుంటే వారి రాజకీయ చదరంగంలో ముద్రగడ పద్మనాభం ఒక పావుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ చేదు అనుభవం తరువాత ముద్రగడ పద్మనాభం ఇకపై రాజకీయ నాయలందరినీ సమాన దూరంలో పెడితే మంచిదేమోననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఆయన ఈరోజు దీక్షని విరమించవచ్చని తాజా సమాచారం. కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇన్ని రోజులు దీక్ష చేసిన తరువాత ఒకవేళ ముద్రగడ తన డిమాండ్లు నెరవేరకుండానే దానిని ముగిస్తే ఆయనే నవ్వులపాలవుతారు. ఒకవేళ సెలైన్ ఎక్కించుకొంటూ దీక్షని కొనసాగించినా నవ్వులపాలవుతారు. బహుశః అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో ఈవిధంగా వ్యవహరిస్తోందేమో?