తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాలకొనుగోలు మానేసి కర్నాటక పాలకు మళ్ళటంతో రాయలసీమ రైతులు రోడ్డున పడ్డారు. విభజన సమస్యల్లో ఇదొకటి.
రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచినా సహకార రంగంలోని విజయ డెయిరీ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, ఆస్ధులు, అప్పుల పంపకాలు,ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విభజన సమస్య పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించకపోగా పంతాలకు పోతున్నాయి.
విజయడైరీ ఇపుడు హైదరాబాద్ నగరానికి రోజూ 1లక్షా25 వేల లీటర్ల పాలుసరఫరా జేస్తోంది. ఇందులో 1 లక్ష లీటర్లు రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్ల్లాలలోని 30 వేల మంది రైతులు విజయ డయరీ కి ఇస్సున్నారు. డయరీలో ఆపాలు ప్రాసెస్ అయి హైదరాబాద్ రవాణా అవుతున్నాయు. వీటిపై తెలంగాణా 20 కోట్ల రూపాయలు బకాయిలు పడింది. విజయ సంస్ధ ఆస్ధులు, అప్పుల పంపకాలు తేలేవరకూ బకాయిల చెల్లింపు జరపరాదని తెలంగాణా నిర్ణయించుకుంది. ఈలోగా పాల అవసరాలు ఆగవుకాబట్టి కర్నాటక నుంచి తెప్పించుకోవడం మొదలు పెట్టారు.
ఎప్పటికైనా బకాయిలు వస్తాయన్న ఆశతో రాయలసీమ రైతులు పాలను యధావిధిగా విజయసంస్ధకే ఇస్తున్నారు. ఆర్డర్ కేన్సిల్ అయిపోవడం వల్ల విజయ డయరీ అధికారులు పాలసేకరణను నిలిపివేశారు. పాతబకాయిలు ఎప్పటికి వసూలౌతాయన్నది ఒక సమస్య అయితే పశువులు ఇచ్చే పాలను ఏంచేసుకోవాలన్నది వారిముందున్న మరో సమస్య!
ఉన్నతాధికారుల స్ధాయిలోనో, మంత్రుల స్ధాయిలోనో విజయ డయరీ పంపకాల ప్రక్రియ వెంటనే పూర్తికాకపోతే రాయలసీమ రైతులకు కొత్త మార్కెట్ వచ్చే వరకూ వారి భారాలు పెరిగిపోతాయి. ఆలస్యమయ్యే కొద్దీ కర్నాటక వ్యాపారం హైదరాబాద్ లో స్ధిరపడిపోతుంది.