రక్షణ రంగంలో విదేశీపెట్టుబడుల గురించి గతంలో పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భాజపా దానిని చాలా గట్టిగా వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు అదే భాజపా ప్రభుత్వం రక్షణ విమానయాన రంగాలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి అనుమతించడం విశేషం. ఇంత కీలకమైన అంశంపై పార్లమెంటులో చర్చించకుండానే మోడీ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా రంగంలో మాత్రం 74శాతం విదేశీ పెట్టుబడులకి ఆమోదం తెలిపింది. ఇంతవరకు ఈ మూడు రంగాలలో 49 శాతం విదేశీ పెట్టుబడికి అవకాశం ఉండేది. మోడీ ప్రభుత్వం ఒకేసారి దానిని 74-100 శాతానికి పెంచేయడంతో ఇకపై ఆ మూడు రంగాలలో బారీగా పెట్టుబడులు పెట్టి, దేశీయంగా బారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు పోటీలు పడవచ్చు.
దీనివలన దేశంలో యువతకి ఉద్యోగావకాశాలు, వాటి నుండి పన్నుల రూపేణా దేశానికి బారీగా ఆదాయం లభిస్తుంది. కీలకమైన ఈ మూడు రంగాలలో విదేశీ పెట్టుబడులు అనుమతించడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. ఇంతవరకు రక్షణ రంగానికి సంబంధించి చాలా పరికరాలను, యంత్రాలని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. దానివలన విదేశీమారక నిలువలు తరిగిపోతుండేవి. ఇప్పుడు విదేశీ సంస్థలే మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపిస్తే విదేశీమారక నిలువలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా విదేశీ సంస్థలకి అనుబంధంగా పనిచేసే సంస్థలు కూడా భారత్ తరలిరావచ్చు. లేదా మన దేశంలో పారిశ్రామికవేత్తలే వాటికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుంది. విదేశీ సంస్థల నుంచి అత్యాదునికమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా లభిస్తుంది.
అయితే ఈ నిర్ణయం వలన నష్టాలు కూడా లేకపోలేదు. ఇంతవరకు రక్షణరంగానికి అవసరమైన అనేక ముఖ్యమైన పరికరాలని, ఆయుధాలని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేస్తుండేవి. ఇప్పుడు వాటి కంటే అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో విదేశీ సంస్థలు ఉత్పత్తి చేయడం మొదలుపెడితే, దేశీయంగా ఏర్పాటు చేసుకొన్న ఆ వ్యవస్థలన్నీ క్రమంగా నిర్వీర్యం కావచ్చు. అలాగే స్వదేశీ సంస్థలలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి తయారీకి నిరంతరంగా కృషి, ప్రయోగాలు జరుగుతుండేవి. విదేశీ సంస్థల వలన వాటికి ఇదివరకటి ప్రోత్సాహం కరువవచ్చును. ఒకప్పుడు ఫార్మా రంగంలో రారాజుగా వెలిగిన ఐ.డి.పిల్.ఎల్ వంటి సంస్థలు ప్రైవేట్ సంస్థలు ప్రవేశించగానే క్రమంగా నిర్వీర్యం అయిపోవడమే కాకుండా చివరికి అదే ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారింది. ఇది ఒక్క ఫార్మాకే కాదు..ఏ రంగానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కార్పోరేట్ ఆసుపత్రులు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ వచ్చిన తరువాత చిన్నచిన్న ఆసుపత్రులు, కళాశాలలు, కిరాణాకొట్లు ఏవిధంగా కనబడకుండా మాయం అయిపోతున్నాయో, అదే విధంగా బారీ పెట్టుబడులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విదేశీ సంస్థలు తరలివస్తే దేశీయ పరిశ్రమలు కూడా దెబ్బ తినవచ్చు. మహాత్మా గాంధీజీ స్వదేశీ ఉత్పత్తులని, కుటీర పరిశ్రమలని, చేతి వృత్తులని, వ్యవసాయాన్ని ప్రోత్సహించమని కోరుకొంటే, అదే గడ్డ మీద పుట్టిన నరేంద్ర మోడీ ఇప్పటి అవసరాలకి విదేశీ పెట్టుబడులు, విదేశీ సంస్థలు, విదేశీ ఉత్పత్తులు చాలా అవసరమని భావిస్తుండటం విశేషం. ఆయన తీసుకొన్న ఈ నిర్ణయం వలన దేశానికి మేలు చేస్తుందా..కీడు చేస్తుందా? అనే విషయంపై దేశంలోని మేధావులు, సంబంధిత రంగ నిపుణులు తమ అభిప్రాయాలని తెలియజేయస్తారు.