తెరాస ఆకర్ష దెబ్బకి తెలంగాణాలో తెదేపా దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. అందరికీ తెలిసిన కారణాల వలన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాలో తన పార్టీకి, అక్కడి రాజకీయ వ్యవహారాలకి దూరంకావడంతో ఇక రాష్ట్రంలో తెదేపా దుఖాణం మూతపడినట్లే అని అందరూ భావించారు. కానీ తెలంగాణా తెదేపా నేతలు మాత్రం 2019 ఎన్నికలనాటికి తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని తెరాసను డ్డీ కొనడానికి సిద్దం అవుతుండటం విశేషం. ఇటీవల తెదేపా ప్రధాన కార్యాలయంలో తీసుకొన్న నిర్ణయాల మేరకు ఖాళీ అయిన జిల్లా ఇన్ చార్జ్ పదవులలో కొత్త వారిని నియమించింది.
ఖమ్మం జిల్లా ఇన్-చార్జ్ గా సీతక్క, వరంగల్-సండ్ర వెంకట వీరయ్య, నల్గొండ-రేవూరి ప్రకాష్ రెడ్డి, హైదరాబాద్-పెద్దిరెడ్డి, రంగారెడ్డి-అరవింద్ కుమార్ గౌడ్, మెదక్-దయాకర్ రెడ్డి, మహబూబ్ నగర్-గరికపాటి, కరీంనగర్-ప్రతాప్ రెడ్డి, నిజామాబాద్-మల్లయ్య యాదవ్, ఆదిలాబాద్-వీరేంద్ర గౌడ్ నియమితులయ్యారు. మంచిర్యాల్ ఇంచార్జ్ గా మల్లేశం నియమితులయ్యారు.
మొదటిదశలో ప్రతీ జిల్లాలో ఆరు నియోజక వర్గాలలో ప్రజలని, కార్యకర్తలని తెదేపా సీనియర్ నేతలు కలుస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. తెలంగాణాలో భాజపా కూడా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణాలో వైకాపా కూడా జిల్లా ఇంచార్జ్ లని నియమించుకొనప్పటికీ, వాళ్ళు తమ పార్టీ ఉనికినే చాటుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం వారిలో వారే కుమ్ములాడుకోవడంలో తీరిక లేకుండా ఉన్నందున పార్టీని బలోపేతం చేసుకోలేకపోతున్నారు. ఆ సమస్య నుంచి బయటపడిన తరువాత వారు కూడా పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అన్ని పార్టీలు బలపడితే, తెరాస ఆకర్ష బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.