సరైన సమయంలో సరైన నిర్ణయం.. గొప్ప ఫలితాల్నిస్తుంది. ఇది నాని విషయంలో మరోసారి రుజువైంది. భలే భలేమగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ తరవాత నాని కెరీర్ ఓ రేంజులోకి వెళ్లిపోయింది. అప్పటి వరకూ మంచి సినిమాలు చేస్తాడన్న నానిపై ‘కమర్షియల్ హీరో’ అనే ముద్ర పడిపోయింది. ‘నాని సినిమాలు మినిమం గ్యారెంటీ, కళ్లు మూసుకొని కొనేయొచ్చు’ అన్న ధీమా కలిగింది. ఇవన్నీ చూసి ఏ హీరో అయినా… ఓ అడుగు ముందు కేసి, పెద్ద దర్శకులతో జట్టు కట్టాలనుకొంటాడు. కమర్షియల్ సినిమాలే చేయాలనుకొంటాడు. కానీ నాని అందరిలా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే… ఈ రోజు జెంటిల్మెన్ లాంటి హిట్ తన ఖాతాలో ఉండేదే కాదు.
బందిపోటు సినిమా చూసిన ఎవరైనా ఇంద్రగంటి మోహన కృష్ణతో సినిమాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకొంటారు. అలాంటిది వరుస హిట్లతో ఊపుమీదున్న నాని… ఇంద్రగంటి కథకు ఓకే చెప్పేశాడు. ”ఇదేదో ఆబ్లికేషన్ పై చేస్తున్న సినిమా” అంటూ జెంటిల్మెన్ పై భారీ ఎత్తున నెగిటీవ్ ప్రచారం సాగింది. ‘నాని అంటే ఫన్.. కానీ ఇంత బరువైన సినిమా ఎందుకు చేస్తున్నాడు?’ అంటూ కొంతమంది పెదవి విరిచారు. సినిమా విడుదలయ్యాక… అందరి నోళ్లూ మూతపడ్డాయి. నాని చేసింది ప్రయోగమే కావొచ్చు. కానీ కమర్షియల్ లైన్ నుంచి కొంచెం కూడా పక్కకు తప్పుకోలేదు. ఈ సినిమాకొస్తున్న భారీ వసూళ్లే అందుకు సాక్ష్యం. ఇలాంటి కథ నానినే చేయగలడు.. అనే విషయాన్ని నిరూపించుకొంటూ, తన ఇమేజ్‌ని మరో నాలుగు మెట్లు పైకెక్కించాడు. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయినా నానికి వచ్చిన నష్టమేం ఉండేది కాదు. ఎందుకంటే ‘ఆబ్లికేషన్‌తో చేసిన సినిమా’ అన్న ట్యాగ్ ఎలాగూ ఉంది. ఆ ఫ్లాప్ కాస్త దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఖాతాలో పడిపోయేది. కాబట్టి.. నాని ‘జెంటిల్మెన్’ కథని ఎంచుకొని సరైన నిర్ణయమే తీసుకొన్నాడు. అందుకే.. నాని తూ గ్రేట్ హో!!