గత యూపియే పాలనతో పోలిస్తే మోడీ పాలన అన్నివిధాల చాలా మెరుగుగానే ఉన్నప్పటికీ, మోడీ ప్రభుత్వం కూడా తన రాజకీయ ప్రత్యర్దులని కట్టడి చేసే విషయంలో కాంగ్రెస్ అడుగుజాడలలోనే నడుస్తున్నట్లు కనబడుతోంది. రెండేళ్ళ పాలనలో ఒక్క అవినీతి మరక కూడా అంటకుండా పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి ఇది ఒక మచ్చగా మిగిలిపోవచ్చు. అది స్వయంకృతాపరాధమే కనుక అందుకు ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు. మోడీ తన పరిపాలనతోనే ప్రజలని మెప్పించి వివిధ రాష్ట్రాలలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాజపాని గెలిపించుకోవచ్చు కానీ ముందు జాగ్రత్త చర్యగా తన రాజకీయ ప్రత్యర్దులని కట్టడి చేస్తున్నట్లు కనబడుతోంది.
డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిపై నీళ్ళ ట్యాంకర్ల కుంభకోణం కేసులో ఏసిబి అధికారులు కేసులు నమోదు చేశారు. షీలా దీక్షిత్ హయంలో రూ.400 కోట్ల కుంభకోణం జరిగితే, ఆ కేసుపై దర్యాప్తుకి ఆదేశించకుండా ఆ ఫైల్స్ ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశ్యపూర్వకంగా తన వద్ద త్రొక్కిపట్టి ఉంచారని బాల్ ఎమ్మెల్యే విజేందర్ రూపా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కి పిర్యాదు చేయడం, వెంటనే ఆయన ఆదేశాలు జారీ చేయడం, తక్షణమే ఏసీబి అధికారులు వారిరువురిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం అన్నీ శరవేగంగా జరిగిపోయాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న పంజాబ్ ఎన్నికలలో తన అమాద్మీ పార్టీని గెలిపించుకొని మెల్లిగా తన పార్టీని పంజాబ్ కి విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం షీలా దీక్షిత్ ని పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జిగా లేదా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా గానీ ప్రకటించే అవకాశం ఉంది. బహుశః అందుకే వారిద్దరిపై భాజపా బురద జల్లడం మొదలుపెట్టినట్లుంది.
ఆ ఫైలు అరవింద్ కేజ్రీవాల్ వద్ద ఉంటే ఆయన కూడా ఆ నేరంలో భాగస్తుడే అయితే, రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు మొదలు ఒక జిల్లా స్థాయి ప్రభుత్వాధికారి వరకు చాలా మంది వద్ద ఇటువంటి ఫైళ్ళు చాలా పెండింగులో ఉంటాయి. ఇక న్యాయస్థానాలలో లక్షలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయి. కనుక వాళ్ళందరూ కూడా నేరస్తులేనని చెప్పగలమా? ఒకవేళ ఆ కుంభకోణానికి షీలా దీక్షిత్ బాధ్యులని గవర్నర్ నజీబ్ జంగ్ నమ్ముతున్నట్లయితే, దానిపై తక్షణం విచారణ జరిపించమని ఆయన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నే నేరుగా కోరవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ హోదాని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఆయనపై ఎసిబి చేత ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించడం రాజకీయ కక్ష సాధింపుగానే భావించవలసి ఉంటుంది.
ఇటువంటి చర్యలన్నీ మోడీ ప్రభుత్వానికి ప్రజలలో ఉన్న మంచిపేరు పాడు చేసి చెడ్డపేరు తీసుకువస్తాయి.
మోడీ ప్రభుత్వం, భాజపా అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. షీలా దీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్ ని చూసి అంతగా భయపడిపోవడం అవసరమా? తమకున్న ప్రజాధారణతో వాళ్ళిదరిని ఎదుర్కోలేమా? ఒకవేళ వాళ్ళిద్దరూ ఇదే అంశాన్ని ఎన్నికల గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వారిపై బురద జల్లి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రజలు భాజపాకే ఓట్లు వేస్తారా? అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిది.