ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన అద్భుతమైన ఆరోగ్య, వ్యాయామ సాధనం యోగా. దాదాపు అన్ని శరీరభాగాలకూ మేలైన యోగ భంగిమలున్నాయి. అనేక వ్యాధులను రానివ్వకుండా ఉండాలంటే యోగా చేస్తే సరిపోతుంది. నిజానికి భారత్ లో కంటే అమెరికాలోనే యోగా బాగా ప్రాచుర్యం పొందింది. అమెరికాలో కోట్లాది మంది యోగసాధన చేస్తున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న తర్వాతే భారతీయులు కూడా తమ యోగాను ఆదరించడం, ఆచరించడం మొదలుపెట్టారు. భారతీయులకు యోగా అలవాటు కావడంలో బాబా రాందేవ్ పాత్ర కూడా ప్రశంసనీయం.
అమెరికన్లలో సుమారు 16 కోట్ల మంది యోగసాధకులని ఓ అంచనా. ఆ దేశ జనాభా 32 కోట్ల పైచిలుకు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు యోగ సాధన చేస్తున్నారన్న మాట.
ప్రపంచ వ్యాప్తంగా యోగ సాధన చేసే వారి సంఖ్య 30 కోట్లకు పైమాటే అని అంచనా.
యోగా అనేది ఆరోగ్యాన్ని కాపాడుకునే ఓ సాధారణ సాధనం కాదు. అది ఓ పెద్ద పరిశ్రమ. అమెరికాలో యోగా పేరుతో సుమారు 28 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. అంటే భారతీయ కరెన్సీలో లక్షా 90 వేల కోట్ల రూపాయలు.
అమెరికన్ల ఏడాది బడ్జెట్లో యోగాకు మంచి స్థానమే ఉందట. ఏడానికి సగటున అమెరికన్లు యోగాపై దాదాపు 1100 కోట్ల డాలర్లు ఖర్చు పెడతారట.
మంచి ఆరోగ్యం కోసం యోగా చేసే వారు 98 శాతం మంది. ఇది మంచి వ్యాయామమని, ఒత్తిడిని అంటే స్ట్రెస్ ను తగ్గించడానికి దివ్యౌషధమని భావించే వారూ చాలా మందే ఉన్నారు.
యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే రిస్క్ 87 శాతం తగ్గుతుంది. ఇన్ ఫెక్షన్ వల్ల వ్యాధులు సోకే రిస్క్ 30 శాతం తగ్గుతుంది.
యోగాను మరిన్ని కొత్త రీతుల్లో కొత్త పేర్లతో నేర్పే గురువులు చాలా మందే ఉన్నారు. బిక్రం యోగా, హఠ యోగా తదితర పేర్లతో యోగాకు గ్లామర్ అద్ది మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాన్ని, ఆదాయాన్ని పెంచుకునే వారూ చాలా మందే ఉన్నారు.
యోగా మ్యాట్ మొదలుకుని ప్యాంట్లు, ఇతర వస్తువుల వ్యాపారం కూడా బిలియన్లలోనే జరుగుతుంది. ఫీజులు వగైరాలు మామూలే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, యోగా గురువుకున్న పాపులారిటీని బట్టి ఫీజు ఉంటుంది. ఏది ఏమైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చొరవ వరల్ల భారతీయ యోగాకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అన్ని దేశాల్లోనూ భారత్ కీర్తి పతాకం రెపరెపలాడుతుంది.