తెలంగాణాలో తెదేపాని దాదాపు ఖాళీ చేసేసిన తరువాత, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టడంతో ఆ పార్టీ నుంచి కూడా తెరాసలోకి వలసలు మొదలయ్యాయి. డిల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నేతలు అందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. వారికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ అన్నీ కూడా కెసిఆర్ కుటుంబ సభ్యులు, తెరాస నేతల జేబులు నింపుకోవడానికేనని విమర్శించారు. బయ్యారం గనులను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే ప్రతిపాదనను విరమించుకోవాలని లేకుంటే దానిపై తమ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలని నయాన్నో భయాన్నో లొంగదీసుకొనే ప్రయత్నాలు మానుకోవాలని కెసిఆర్ ని హెచ్చరించారు. ఇంకా చాలా అంశాలపై కెసిఆర్ ప్రభుత్వ తీరుని తప్పు పడుతూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షాలు అధికార పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే. అయితే అవి సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడే వాటికి విలువ ఏర్పడుతుంది. టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి పనులని, పధకాలని వారు తప్పు పడుతున్నారు. అవన్నీ తెలంగాణా ప్రజలు, రాష్ట్రం కోసం కాక కెసిఆర్ కుటుంబ సభ్యులు, తెరాస నేతలకి లబ్ది కలిగించేందుకే రూపొందించబడ్డాయని వితండ వాదన చేస్తున్నారు. ఒకవేళ వారి వాదనే నిజమనుకొంటే ఇంక తెలంగాణా ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేపట్టకూడదు. కానీ ఏ ప్రభుత్వమైనా ఆవిధంగా చేతులు ముడుచుకొని కూర్చోవడం సాధ్యమేనా? ఒకవేళ ఏ పని చేయకుండా కూర్చొంటే అప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శించకుండా ఊరుకొంటాయా?
ప్రభుత్వం చేపట్టే వివిధ పనులు, ప్రాజెక్టులలో ఎంతో కొంత అవినీతి జరుగుతూనే ఉంటుంది. దానిని పూర్తిగా నివారించలేకపోయినా అదుపు చేయడం చాలా అవసరం. అన్ని ప్రభుత్వాలు అటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అవినీతిని అదుపు చేయగలిగినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అది కళ్ళకి కనబడుతుంది. లేనిచోట అభివృద్ది కాగితాల మీదనే కనబడుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అదే జరిగింది. కానీ ఈ రెండేళ్ళలో తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్ళకి కట్టినట్లు కనబడుతోంది. టీ-కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న మిషన్ కాకతీయ, భగీరధ, విద్యుత్ ఉత్పత్తి, తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. వాటి ఫలాలు ప్రజలకి అందుబాటులోకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళలో చేయలేని అనేక పనులని తెరాస ప్రభుత్వం కేవలం రెండేళ్ళలో చేసి చూపించింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద తెలంగాణా కోసం ఇంకా చాలా బారీ ప్రణాళికలున్నాయి. ఆ ప్రణాళికలన్నీ అమలయితే రాష్ట్ర ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుంది. అదే జరిగితే, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకొనేవారే ఉండరు. బహుశః ఆ భయంతోనే కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా కెసిఆర్ పై విమర్శలు గుపిస్తున్నారేమో? అయితే వారికి ఆ అవకాశం కల్పించింది కెసిఆర్ అని చెప్పక తప్పదు.
రాష్ట్రాన్ని అబివృద్ధి పధంలో నడిపిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇంకా ఆయన ప్రతిపక్షాలని చూసి భయపడవలసిన అవసరం ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. వాటిని చూసి భయపడేకంటే వాటిని ఎన్నికలలో డ్డీ కొని గెలిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది. తెరాసకి, ముఖ్యమంత్రి కెసిఆర్ అది చాలా గౌరవంగా, హుందాగా ఉండేది. ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రజలు తెరాసకే ఓట్లు వేసి గెలిపించుకొంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస నేతలు అందరూ గొప్పగా చెప్పుకొంటున్నారు. మరి ప్రజలు తెరాస వైపే ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెరాసకి సవాలు విసురుతాయని భయపడటం ఎందుకు? అవి తెరాసకి అడ్డుగా ఉన్నాయని భావించి వాటిని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించడం ఎందుకు? ప్రజలు అభివృద్ధి, సుఖశాంతులనే కోరుకొంటారు. వాటిని అందివ్వగల పార్టీకే మళ్ళీ అధికారం కట్టబెడుతుంటారు. తమ పార్టీ, ప్రభుత్వం పట్ల తెలంగాణా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లుగా కెసిఆర్ నిజంగానే నమ్ముతున్నట్లయితే, ఇటువంటి అప్రజాస్వామిక ఆలోచనలు, ప్రయత్నాలు మానుకొంటే బాగుంటుంది.