తుని విద్వంసం కేసులో అరెస్టయిన వారందరినీ ప్రభుత్వం విడిచిపెట్టింది. కానీ ముద్రగడ పద్మనాభం ఇంకా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. విడుదలైన వారిని అందరినీ తన వద్దకి తీసుకువచ్చి చూపిస్తే తప్ప దీక్ష విరమించేది లేదని ఆయన చెపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ప్రభుత్వం ఆయన డిమాండ్లకి తలొగ్గి కాపు కార్పోరేషన్ కి నిధులు కేటాయించి, మంజునాథ కమీషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన ప్రభుత్వంపై అనవసరంగా యుద్ధం మొదలుపెట్టారు. ముద్రగడ ఆ విధంగా వ్యవహరించడం వలననే ఆయన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని తెదేపా నేతలు ఆరోపించగలుగుతున్నారు. ఆ కారణంగానే సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. అందుకు ఇరుపక్షాలు కారణం అయినప్పటికీ, ముద్రగడ పద్మనాభం తన లక్ష్యమైన కాపులకి రిజర్వేషన్లు సాధించడంపై దృష్టి పెట్టకుండా అనవసర రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలలో కలిగింది.
మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభుత్వం దిగివచ్చి ఆయన కోరినట్లుగానే అందరినీ విడుదల చేసినప్పటికీ, ఆయన ఇంకా ఫ్లూయిడ్స్ ఎక్కించుకొంటూ ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగించడం వలన ప్రజలకి మళ్ళీ తప్పుడు సంకేతాలు పంపుతునట్లుంది. ఆయన ఇంకా దీక్షని కొనసాగించాలనుకోవడంతో దాని వెనుక కారణాలు ఏమిటి? ఆయనని వెనుక నుంచి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి.
ఆయనకి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి కార్పోరేట్ ఆసుపత్రికి తరలించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్లన్నిటినీ నెరవేర్చిన తరువాత తక్షణం ఆయనని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపవలసిన ప్రభుత్వం, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెపుతున్నప్పటికీ కార్పోరేట్ ఆసుపత్రికి ఎందుకు తరలించాలనుకొంటోంది? ఆయన ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్యని ఇంకా ఇలాగే సాగదీస్తే ఇటువంటి అనుమానాలే అందరికీ కలుగుతుంటాయి. వాటి వలన ముద్రగడ, ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అప్రదిష్టపాలయ్యే అవకాశం ఉంటుందని గ్రహిస్తే మంచిది.