హైదరాబాద్: కులాభిమానం ఉండటం తప్పుకాదు. కానీ కొందరు అమాయక బ్రాహ్మణులకుమాత్రం అది శాపమై కూర్చుంది. హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో ఉండే యల్లాప్రగడ ప్రభాకరశర్మ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక బ్రాహ్మణుడై ఉండీ, ఎందరో అమాయక బ్రాహ్మణులను కల్లబొల్లి మాటలు చెప్పి మోసగించి కోట్లకు పడగలెత్తిన వైనం బయటపడింది. గుంటూరుజిల్లా గోరంట్లకు చెందిన ఈ వ్యాపారి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు గ్రామపరిధిలో ఒక వెంచర్ వేశాడు. దానికి గ్రామ పంచాయతీనుంచిగానీ, హెచ్ఎమ్డీఏనుంచిగానీ అనుమతులు తీసుకోలేదు. 36 ఎకరాలలో 200 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించగా మొత్తం 400 ప్లాట్లు వచ్చాయి. ఇక ప్రచారం మొదలుపెట్టాడు. కేవలం బ్రాహ్మణులకోసమే అగ్రహారం పద్ధతులలో టౌన్షిప్ రూపొందిస్తున్నామంటూ అతని ప్రచారం సాగింది. వెంచర్లో – పేరుదగ్గరనుంచి అతను చెప్పిన విశేషాలు చూస్తే బ్రాహ్మణులు నమ్మటంలో ఆశ్చర్యంలేదనిపిస్తుంది. గాయత్రీ మాత దేవాలయం, వేదపాఠశాల, గోశాల, కళ్యాణమంటపం, ఓల్డ్ ఏజ్ హోమ్, అనాథాశ్రమం, హోమియోపతి క్లినిక్, ప్రహరీ మొదలైన సౌకర్యాలున్నాయని చెప్పాడు. 200 గజాల స్థలం ఖరీదు 6.5 లక్షల రూపాయలేనని, 20% సొమ్ము మొదట చెల్లించి మిగిలిన రు.5 లక్షలను 100 వాయిదాలలో చెల్లించొచ్చని ఊరించాడు. పేపర్లలో, టీవీ ఛానల్స్‌లో ప్రకటనలు గుప్పించాడు. నాగోల్‌లోని తన ఇంటివద్దనుంచి కార్లలో, బస్సులలో శంషాబాద్ సమీపంలో ఉన్న ఆ వెంచర్ వద్దకు తీసుకెళ్ళి అక్కడ విందుభోజనాలు పెట్టాడు. కొసరి కొసరి నెయ్యి వడ్డిస్తూ కమ్మని మాటలుకూడా చెప్పాడు. హోమాలు చేయించాడు. ఇవన్నీ చూసి అమాయక బ్రాహ్మణులు ఎందరో అతని వలలో పడ్డారు…వెంచర్లో సభ్యులుగా చేరారు.
అదంతా నాలుగేళ్ళనాటి మాట. సభ్యుల డబ్బుతో కోట్లకు పడగలెత్తిన ప్రభాకరశర్మ దానితో విలాసాలు మొదలుపెట్టాడు. 23 వాహనాలు(వీటిలో రెండు బస్సులు) కొన్నాడు. ఇళ్ళు కొనుక్కున్నాడు. అయితే గత సంవత్సరకాలంనుంచీ వెంచర్లో శర్మ చేసిన అక్రమాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. వెంచర్‌లోని మొత్తం ప్లాట్లు 400 అయితే వేయిమందికిపైగా వాటిని అతను అమ్మాడు. రిజిస్ట్రేషన్ సరిగా లేదని గమనించిన కొందరు సభ్యులు శర్మను నిలదీయగా, ఏం చేసుకుంటారో చేసుకోండని అతను సవాల్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా మీకు తిరగటంతప్పితే ఏమీ మిగలదని హెచ్చరించాడు. సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. అయితే వెంచర్ ఆ స్టేషన్ పరిధిలోకి రానందువల్లో, ఏమోగానీ పెద్దగా కదలిక లేదు. తాజాగా సీహెచ్.శివరామకృష్ణ అనే సభ్యుడు ధైర్యంచేసి వెంచర్ ఉన్న ప్రాంతంలోని కొత్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో అధికార యంత్రాంగం కదిలింది. శర్మను అరెస్ట్ చేసింది. ఇది పేపర్లలోకొచ్చిన తర్వాత సభ్యులు శర్మచేతిలో పడ్డ బాధలు మీడియాద్వారా ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్నుంచికూడా శర్మబారినపడిన వీరి గాధలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమవద్ద ఉన్న రిటైర్మెంట్ మొత్తాలను, ఆడపిల్లల పెళ్ళిళ్ళకోసం, మగపిల్లల చదువులకోసం దాచుకున్న యావత్ ధనాన్ని శర్మకు సమర్పించుకున్నామని వాపోతున్నారు.
నిశితంగా గమనిస్తే, ఒక దశాబ్దకాలంగా తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న ఒక పరిణామం ప్రభాకరశర్మను ఈ మోసం చేయటానికి పురికొల్పిందని చెప్పొచ్చు. అది ఏమిటంటే, సినీరంగంలో లబ్దప్రతిష్టలైన బాలు, విశ్వనాథ్, సిరివెన్నెలవంటి బ్రాహ్మణులను రియల్ ఎస్టేట్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని వెంచర్లను బ్రహ్మాండంగా అమ్ముకోవటం. ‘సువర్ణభూమి’ అనే సంస్థతో ఈ ట్రెండ్ ప్రారంభమయింది. అయితే ఆ సంస్ఖ అది కావాలని చేయలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని, విశ్వనాథ్‌లను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. బాలు, విశ్వనాథ్ వంటి ప్రముఖులు ప్రచారంచేస్తే ఆ బ్రాండ్‌కు సహజంగానే విశ్వసనీయత పెరుగుతుందని అనుకున్నారు. దానితోబాటుగా ఒక విశేషం చోటుచేసుకుంది. బాలు, విశ్వనాథ్ ప్రచారం చేయటంతో ఆ సంస్థ బ్రాహ్మణులదేనని భావించి దేశ, విదేశాలలో ఉన్న బ్రాహ్మణులు ఎందరో ఆ వెంచర్లలో పెట్టుబడి పెట్టారు. వాస్తవానికి వారి భావన నిజంకాదు. అయితే ఈ పరిణామాన్ని గమనించిన ‘శుభగృహ’ అనే సంస్థ, సిరివెన్నెల సీతారామశాస్త్రిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంది. ఆ సంస్థకూడా బాగా లాభపడింది. మరోవైపు వాస్తవంగా బ్రాహ్మణులే స్థాపించిన ఆగ్రిగోల్డ్ సంస్థ, తమ సామాజికవర్గానికే చెందిన సాయికుమార్, ఆయన తండ్రి పి.జె.శర్మ, కొడుకు ఆదిలతో ప్రచారం చేయించుకున్నారు. అయితే అక్కడ ఆగ్రిగోల్డ్ సంస్థ దివాళా తీయటంతో నష్టపోయిందికూడా ఎక్కువమంది బ్రాహ్మణులే కావటం విశేషం. వీరిలో సంస్థ ఏజెంట్లుగా పనిచేసినవారు చాలామంది ఉన్నారు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన కపిల్ హోమ్స్ సంస్థ, తామెందుకు తక్కువ తినాలని మరో బ్రాహ్మణ నటుడు చంద్రమోహన్ ను రంగంలో దించింది.
బ్రాహ్మణ ప్రముఖులతో ప్రచారం చేయించుకుని బ్రాహ్మణేతరులు అనేకమంది లాభాలు గడించటమనే పరిణామాన్ని గమనించిన ప్రభాకరశర్మ పూర్తిగా బ్రాహ్మణులకోసం అగ్రహారం అనే కాన్సెప్ట్‌ను తన యూఎస్పీగా చేసుకుని రంగంలోకి దిగాడు. అయితే నిజయితీగా చేయకుండా సొంత కులంలోని అమాయకులనే మోసం చేయానికి పూనుకున్నాడు. పోలీసులుమాత్రం అతని ఆస్తులన్నీ జప్తుచేసి బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేటట్లు చూస్తామంటున్నారు. అతనిపై 420, 406 సెక్షన్లకింద కేసులు పెట్టినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ చెప్పారు.