ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల దగ్గర నుంచి పంటభూములు సేకరణకి ప్రభుత్వం పూనుకొన్నప్పుడు రైతులు, ప్రజలు, ప్రతిపక్షాల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా సరిగ్గా అటువంటి నిర్ణయాలు, పరిణామాలే జరుగుతుండటం విశేషం.
ఆంధ్రాలో రాజధాని కోసం భూసేకరణ చేస్తే, తెలంగాణాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం చేస్తున్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తే తెలంగాణాలో రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఆంధ్రా ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణా ప్రభుత్వం కూడా ఈవిషయంలో వెనక్కి తగ్గే ఆలోచన చేయడం లేదు. ప్రాంతాలు, పార్టీలు వేరు తప్ప రెండు చోట్ల ఒకే రకమైన సమస్య, రాజకీయ పరిణామాలు కనబడుతున్నాయి.
మెదక్ జిల్లాలో నిర్మితమవుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం చేయాలని కోరుతూ త్వరలో 48గంటలు నిరాహార దీక్ష చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఆ ప్రాజెక్టు నిర్మించవచ్చు కానీ అంతకంటే ముందు భూములు కోల్పోయిన నిరుపేద రైతులకి చట్ట ప్రకారం పరిహారం చెల్లించి, వారి పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితులకి న్యాయం జరిగేవరకు తెదేపా వారికి అండగా నిలిచి ప్రభుత్వంతో పోరాడుతుందని అన్నారు.
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి అడ్డు తగులుతున్నాడని తెదేపా మంత్రులు, నేతలు వాదిస్తుంటారు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకి అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాడని తెరాస మంత్రులు, నేతలు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రా ద్రోహి అని తెదేపా నిందిస్తుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణా ద్రోహి అని తెరాస నేతలు విమర్శిస్తున్నారు.
రాజధాని భూముల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని అర్ధంతరంగా విరమించుకొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకి న్యాయం చేకూరే వరకు రేవంత్ రెడ్డి పోరాడుతారా లేక ఆయన కూడా మధ్యలోనే విరమించుకొంటారా? తెలంగాణా ప్రభుత్వం నిర్వాసితులకి పూర్తి న్యాయం చేస్తుందా…లేదా? అనే సంగతి మరికొన్ని రోజులలోనే తెలియవచ్చు.