అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై నిన్న హత్యా ప్రయత్నం జరిగింది. కానీ ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయన నిన్న లాస్ వెగాస్ నగరంలో గల ట్రెజర్ ఐల్యాండ్ కాసినో సమీపంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నపుడు ఒక యువకుడు ఆయనని సమీపించి ఆటోగ్రాఫ్ అడిగాడు. అదే సమయంలో పక్కనే ఉన్న ఒక పోలీస్ అధికారి నుంచి రివాల్వర్ లాక్కొని డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరపాలని ప్రయత్నించాడు కానీ ట్రంప్ భద్రతా సిబ్బంది వెంటనే అతనిని బందించి పోలీసులకి అప్పజెప్పారు.
అతని పేరు మైఖేల్ స్టాన్ ఫోర్డ్, వయసు 20సం.లు, బ్రిటన్ పౌరుడని పోలీసులు గుర్తించారు. అతని వద్ద బ్రిటన్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. ట్రంప్ ని హత్య చేయాలని తను ఏడాది క్రితమే నిర్ణయించుకొన్నానని ఆ యువకుడు చెప్పాడు. అతను 18 నెలల క్రితం అమెరికాకి వచ్చేడు. ఒకవేళ ఇప్పుడు తన ప్రయత్నం విఫలం అయితే ఫినిక్స్ లో జరుగబోయే ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ ని హత్య చేయాలనుకొన్నట్లు చెప్పాడు. అయితే అతను ట్రంప్ ని ఎందుకు హత్య చేయాలనుకొన్నాడో, అతనికి ఉగ్రవాదులకి ఏమైనా సంబంధాలున్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలవలసి ఉంది. ముస్లింలకు, ఐసిస్ ఉగ్రవాదులకి వ్యతిరేకంగా డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న చాలా వివాదాస్పద వ్యాఖ్యల వలన వారు ఆగ్రహంగా ఉండటం సహజమే. కనుక ఐసిస్ ఉగ్రవాదులు ఆయనపై హత్యాప్రయత్నం చేస్తే ఆశ్చర్యమేమీ లేదు. కనుక ట్రంప్ పై హత్యాప్రయత్నం చేస్తూ పట్టుబడిన బ్రిటన్ యువకుడికి వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఒకవేళ అతనికి ఉగ్రవాదులతో సంబంధం లేకపోతే, అతను ట్రంప్ ని ఎందుకు హత్య చేయాలనుకొన్నాడో తెలియవలసి ఉంది. పైగా అతను అమెరికా పౌరుడు కూడా కాదు. అంతర్జాతీయ వ్యవహారాలు, విదేశీ విధానాలపై డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైనా అతనికి ఆగ్రహం కలిగించాయా లేకపోతే అకారణ ద్వేషంతోనే ట్రంప్ పై హత్యాప్రయత్నానికి పాల్పడ్డాడా? ట్రంప్ ని హత్య చేయడానికి ఏడాదిగా ఎదురుచూస్తున్నానని అతను చెప్పడం చూస్తే ఇది ఏదో ఆవేశంలోనో అనాలోచితంగానో చేసిన పని కాదని స్పష్టం అవుతోంది.
అతనిని నెవాడా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ట్రంప్ ని హత్యచేయడానికి అతను ప్రయత్నించినట్లు రుజువైతే కనీసం 10ఏళ్ల జైలు శిక్ష, సుమారు 2.5 లక్షల డాలర్లు జరిమానా విధించబడుతుంది. ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కూడా. మళ్ళీ జూలై 5 ఈ కేసు విచారణ జరుగుతుంది.