రెండు వారాల క్రితం ముద్రగడ పద్మనాభం మళ్ళీ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాక్షి మీడియా కాపులని రెచ్చగొట్టేవిధంగా ప్రసారాలు చేస్తునందున రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, అందుకే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేయించిందని సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప మీడియాకి చెప్పారు. సాక్షిపై తాత్కాలికంగానే నిషేధం విధించామని, ముద్రగడ దీక్ష విరమించి పరిస్థితులు చక్కబడగానే సాక్షిపై నిషేధం ఎత్తివేస్తామని కూడా చెప్పారు.
సాక్షి ప్రసారాలని ప్రభుత్వం నిలిపివేయడాన్నిఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి హైకోర్టులో సవాలు చేశారు. దానిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది, సాక్షి ప్రసారాలని నిలిపివేయమని ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ గానీ ఎం.ఎస్.ఓ.లకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకి సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ ఈ కేసుని జూన్ 27కి వాయిదా వేశారు.
సాక్షి ప్రసారాలని నిలిపివేయాలనే అత్యుత్సాహంలో ఈ తరువాత పరిణామాల గురించి ప్రభుత్వం ఆలోచించడం మరిచిపోయినట్లుంది. అదే ఊపులో హోం మంత్రి చిన రాజప్ప తామే సాక్షి ప్రసారాలని నిలిపి వేయించమని ప్రకటించారు. ఆ రోజు ఆయన మీడియాకి చెప్పిన ఆ మాటల క్లిపింగ్స్ ని సాక్షి తరపు న్యాయవాది కోర్టుకి సమర్పించారు. కానీ ఇపుడు ప్రభుత్వం సాక్షి మీడియాని నిషేధించమని ప్రభుత్వం ఎవరినీ ఆదేశించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడం పొరపాటేనని భావించవచ్చు. అదే విషయాన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించడం అంటే, ఆ మాటకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుంది. అప్పుడు హోం మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యల గురించి కోర్టు ప్రశ్నించడం ఖాయం. అదే జరిగితే కోర్టుకి సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. దాని వలన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు.
ఒకవేళ ప్రభుత్వం, పోలీసులు కోరకపోతే సాక్షి ప్రసారాలు ఎందుకు నిలిచిపోయాయి? ఎవరు నిలిపివేశారు? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే దానికి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవడం కష్టమే. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఏమి ఉపాయం ఆలోచిస్తోందో? బహుశః ఆర్ధిక చెల్లింపుల వ్యవహారంలో సాక్షి తీరు సంతృప్తిగా లేనందునో, లేదా బకాయిలు చెల్లించనందుకో ప్రసారాలు నిలిపివేశామని ఎంఎస్.ఓ.ల ద్వారా చెప్పిస్తుందేమో? అయితే దానికి వారు సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏవిధంగా చూసినా సాక్షి విషయంలో ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవనిపిస్తోంది.