గవర్నర్లకి ముఖ్యమంత్రులకి మద్య విభేదాలు ఏర్పడటం కొత్త విషయమేమీ కాదు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మద్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, దానికి మాజీ ఐ.పి.ఎస్. అధికారిణి కిరణ్ బేడిని లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించడం తెలిసిందే.
ఆమె భాజపాకి చెందిన వ్యక్తి అవడంతో ముఖ్యమంత్రి నారాయణసామి (కాంగ్రెస్) ఆమెకి దూరంగా ఉంటున్నారు. కిరణ్ బేడి ఇతర గవర్నర్లలాగ రాజ్ భవన్ కే పరిమితమయిపోయి, ప్రభుత్వం చేసే ప్రతీ పనికి గుడ్డిగా తలూపేరకం కాకపోవడంతో అప్పుడే వారి మద్య భేదాభిప్రాయాలు మొదలైనట్లు తెలుస్తోంది.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిరణ్ బేడి స్వయంగా ఈరోజు పుదుచ్చేరిలో యోగాబ్యాసాల కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరినీ ఆహ్వానించినప్పటికీ, ఒక్కరు కూడా హాజరు కాలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా ఆహ్వానించినా ఆ కార్యక్రమానికి ఎవరూ హాజరుకాకుండా ఆమెకి తాము దూరంగా ఉండదలచామని, అలాగే ఆమె కూడా తమ ప్రభుత్వానికి దూరంగా ఉంటే చాలా మంచిదని ముఖ్యమంత్రి నారాయణసామి స్పష్టంగా చెప్పినట్లే భావించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవు కనుక ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించగలిగారు. కానీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఏర్పడితే మొట్టమొదట ఆమెనే సంప్రదించవలసి వస్తుంది. అప్పుడు ఆమె కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తే ఇబ్బందిపడేది ప్రభుత్వమే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ఇద్దరూ కూడా గవర్నర్ నరసింహన్ తో సత్సంబంధాలు కలిగి ఉంన్నారు. ఆయన కూడా వారితో అదేవిధంగా ఉంటారు. వారు ముగ్గురూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నిజానికి బద్ధ శత్రువులైన ఇద్దరు ముఖ్యమంత్రులని, నిత్యం ఏదో ఒక విషయంపై కీచులాడుకొనే రెండు ప్రభుత్వాలకి, రాష్ట్రాలకి గవర్నర్ గా వ్యవహరించడం కత్తి మీద సాము చేయడం వంటిదే. గవర్నర్ నరసింహన్ చాలా చక్కగా, ఒడుపుగా, ఓర్పుగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన యూపియే ప్రభుత్వం నియమించిన గవర్నరే అయినప్పటికీ, అటు కేంద్రంతో ఇటు ఇరువురు ముఖ్యమంత్రులతో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తూ మంచిపేరు తెచ్చుకొన్నారు.
గవర్నర్ నరసింహన్ ఎదుర్కొనే సమస్యలతో పోలిస్తే కిరణ్ బేడి చాలా సౌకర్యవంతమైన స్థానంలోనే ఉన్నారని చెప్పవచ్చు. కనుక నారాయణ సామి ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెట్టకుండా నిగ్రహించుకోగలిగితే ఆమెకే చాలా మంచిది. అదేవిధంగా కిరణ్ బేడి మిగిలిన గవర్నర్లలాగ అనవసరమైన భేషజాలకిపోరని ముఖ్యమంత్రి నారాయణసామి కూడా గ్రహించి ఆమె పట్ల గౌరవంగా మెలిగితే మంచిది.