సాహిత్యంపై పట్టున్నవాళ్లు సినిమాలు తీస్తే.. ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. మాటల్లో, సన్నివేశాల చిత్రీకరణలో ఆ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. దానికి తోడు తాము చదువుకొన్న పుస్తకాలు, కథలు, నవలలు.. వాళ్లని కొత్త ఆలోచనలవైపు పరుగులుపెట్టిస్తాయి. ఒక్కోసారి ఎప్పుడో చదివిన కథో, లేదంటే తమని బాగా ప్రభావితం చేసిన పుస్తకాన్నో సినిమాగా మలచాలని కూడా అనిపిస్తుంది. అ.ఆ కోసం త్రివిక్రమ్ అదే చేశాడు. తన కాలేజీ రోజుల్లో నిద్రపట్టనివ్వకుండా చేసిన మీనా కథని సినిమాగా మార్చుకొన్నాడు. ఫలితం రూ.50 కోట్ల విలువైన ఓ సూపర్ హిట్ సినిమా మలిచాడు. ఇప్పుడు ఇంద్రగంటి కూడా అదే దారిలో ప్రయాణం చేయబోతున్నాడు.
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఇప్పుడు జెంటిల్మెన్… ఇలా వైవిధ్యభరితమైన చిత్రాలతో తనని తాను నిరూపించుకొన్న దర్శకుడు ఇంద్రగంటి. తన తొలి సినిమా.. గ్రహణం చలం కథ దోషగుణం ఆధారంగా తెరకెక్కినదే. గోల్కొండ హైస్కూల్కీ ఓ ఇంగ్లీషు నవల స్ఫూర్తి. ఇప్పుడు మరోసారి క్లాసిక్ కథలపై దృష్టి పెట్టాడట. తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన పుస్తకం.. బుచ్చిబాబు – చివరకు మిగిలేది. ఆ నవలలో పాత్రల్ని, సంఘటలన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమా తీయాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు ఇంద్రగంటి. అంతే కాదు.. కొడవటిగంటి కుటుంబరావు కథల్ని ఇష్టపడే ఇంద్రగంటి ఆ కథల స్ఫూర్తితో ఓ సినిమా తీస్తానంటున్నాడు. మరి అవెప్పుడు కార్యరూపం దాలుస్తాయో చూడాలి.