రాజకీయం అంటే మనల్ని మనం కాపాడుకుంటూ ప్రత్యర్థుల్ని ఓడించడం. ఇక్కడ కాపాడుకోవవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ప్రత్యర్థుల్ని ఓడించడం అనేది ప్రజల ద్వారా చేయాలి”. ఈ సూత్రంపై కనీస అవగాహన లేకపోతే రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారేమో కానీ.. ఎన్నో కిలోమీటర్ల లోతుకు పడిపోతారు. చంద్రబాబు వంటి పాత తరం రాజకీయ నాయకులకు ఈ పాలిటిక్స్ బాగా తెలుసు. అందుకే వారు నూనూగు మీసాల వయసులోనే రాజకీయం ప్రారంభించినా ఇప్పటికీ.. కొత్త కొత్తగా వచ్చే యువ నేతల్ని కూడా ధీటుగా ఎదుర్కొని రాజకీయ పయనం సాగిస్తున్నారు. కానీ జగన్, కేటీఆర్ లాంటి యువ నేతలు మాత్రం రాజకీయం అంటే తాము చేసిందే అన్న భావనకు వచ్చి.. తమ కాళ్లను తామే నరికేసుకుంటున్నారు. ఏ మాత్రం సహనం లేని రాజకీయం చేస్తూ.. గోతుల్లో పడిపోతున్నారు. మళ్లీ తుడుచుకుని పరుగులు పెట్టవచ్చు కానీ ఆ పడటం వల్ల అయ్యే గాయాలు ఎంత నష్టం చేస్తున్నాయో ఊహించలేకపోతున్నారు.
పాతాళం అంచును వెదుక్కుంటున్న జగన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ రెడ్డిదో విచిత్ర రాజకీయం. ఆయన అంతటి హలోకేషన్లో ఉండి ఎలా రాజకీయం చేస్తారో అని ఆయన ఆలోచనా ధోరణిని కాస్త పరిశీలనగా చూసిన వారికి అర్థమవుతుంది. వైనాట్ 175 అంటూ ఆయన ఆకాశంలోనే ఉన్నారు. కింద పడి మక్కెలిరిగిపోయినా ఆయనకు తెలివి రాలేదు. ఇప్పటికీ అదే రాజకీయం చేస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు వేసిన ట్రాప్ లో ఆయన అడ్డంగా ఇరుక్కుపోయారు. లడ్డూ నెయ్యి కల్తీ జరిగితే నాటి ముఖ్యమంత్రికి ఏం సంబంధమని వాదించి బయటపడాల్సిన చోట.. నేనే నేనే అంటూ ఆయన ముందుకు వచ్చారు. దాంతో అసలు సినిమా మారిపోయింది. ఇప్పుడు తనకు అంటిన ఆ పందికొవ్వు నెయ్యిని తుడుచుకునేందుకు ఏం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. పోనీ ఇప్పుడైనా తెలుసుకుంటున్నారా అంటే.. లేదు అందరూ నవ్వుకునేలా ఒకదానికి మంచి ఒకటి తప్పుడు పనులు చేసుకుంటూ పోతున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో హిందువుల మనోభావాలు ఎలా ఉన్నాయో పట్టించుకోకుండా.. కల్తీ జరగలేదని తనకు ఉన్న మీడియా, సోషల్ మీడియా, మలినమైన నోరు ఉన్న నేతల ద్వారా చెప్పించాలనుకుంటున్నారు. వంద సార్లు చెప్పి అయినా కల్తీ జరగలేదని అనిపించాలనుకుంటున్నారు. కానీ అది రాజకీయ ఆరోపణలు కాదని.. చేయి దాటిపోయిందని గుర్తించలేకపోయారు. ఓ వైపు ఏఆర్ డెయిరీ దొరికిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన పరీక్షల్లోనూ కల్తీ తేలింది. పోలీస్ కేసు అయింది. టెండర్ అర్హతలు కూడా మార్చారని బయటకు వచ్చింది. అంతా కళ్ల ముందే ఉంది. అయినా నెయ్యి ఏడు రోజులే నిల్వ ఉంటుందని.. కల్తీ ట్యాంకర్లు తిరస్కరించామని ఇలా ఏవేవో చెప్పి మభ్య పెట్టగలమని అనుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఆలయాల్లో పూజలు అంటూ ఎదురుదాడి కూడా ప్రారంభించారు.
శ్రీవారిపై లేనిభక్తిని చూపే ప్రయత్నం వ్యర్థం
అనువు కాని చోట అధికులమంటే పరిస్థితి ఎలా ఉంటుందో చిన్నప్పుడు పాఠాల్లోనే నేర్చుకున్నాం. కానీ జగన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవడానికి అతీతుడు. అందుకే ఆయన ఆలయాల్లో పూజలంటూ హడావుడి చేయాలనుకుంటున్నారు. అంత వరకూ ఉంటే సరిపోయేది కానీ తానే స్వయంగా తిరుమలకు వెళ్తానని ప్రకటించాడు. ఇప్పుడు లడ్డూ అంశం పక్కకపోయింది. ఆయన మతం అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు డిక్లరేషన్ అంశం రాజకీయం అయింది. తిరుపతిలో జరిగే ప్రతి రచ్చ వైసీపీకి మైనస్. ఆయనను హిందువుల్లో పలుచన చేస్తుంది. ఇలాంటి సున్నితమైన సమయంలో తిరుపతి వెళ్లాలన్నది అతి పెద్ద బ్లండర్. గతంలో ఆయన రాజకీయం కోసం తప్ప ఎప్పుడూ తిరుపతి వెళ్లలేదు. ఇప్పుడు కూడా రాజకీయం కోసమే వెళ్తున్నారు. దీన్ని ఎలా రాజకీయం చేయాలో అలా చేస్తారు. దీన్ని గుర్తించలేకపోతున్నారు. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను ఆయనే రిస్క్ లో పెట్టుకున్నారు. ఆయన క్రిస్టియన్ అని తెలిసినా ఇప్పటికి చాలా మంది హిందూ ఓటర్లు ఆయన వైపు ఉన్నారు కాబట్టి నలభైశాతం ఓట్లు వచ్చాయి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం , తిరుమలలో డిక్లరేషన్ అంశం ఆయను హిందువులకు మరింత దూరం చేస్తాయి. చంద్రబాబును కులం ప్రకారం వ్యతిరేకించే వారు విధిగా జగన్ కు ఓటేసేవారు. ఇప్పుడు ఆ ఆప్షన్ మెల్లగా పవన్ కల్యాణ్ వైపు వెళ్తోంది. దానికి హిందూత్వాన్ని అస్త్రంగా వాడారు. తన పునాదుల్ని గురి పెట్టారని తెలియని జగన్ అదే డ్రామా రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నారు. చంద్రబాబు కొన్నాళ్లుగా.. జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప ఏపీకి శని వదలదని చెబుతున్నారు. ఆ దిశగా చంద్రబాబు చేస్తున్న రాజకీయానికి జగన్ స్వయంగా సహకరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రెండేళ్లలో చంద్రబాబు టార్గెట్ పూర్తి చేసుకుంటారు. జగన్ రెడ్డి నేనే మోనార్క్..నేను చేసిందే రాజకీయం. చెప్పిందే వేదం అనుకుంటారు. ప్రజలంతా తన బానిసలేనని తాను ఏసుప్రభువు స్వరూపుడినని అనుకుంటారు. ఆ మత్తు ఆయనకు దిగలేదు కాబట్టి ఆయనతో రాజకీయం చంద్రబాబుకు సులువే. చెట్టుకొట్టు మీద వేసుకునే జగన్ రాజకీయాలు చంద్రబాబుకు మరింత ప్లస్సే.
రేవంత్ ను నిందించడమే రాజకీయమనుకుంటున్న కేటీఆర్
తెలంగాణలో కేటీఆర్ కూడా జగన్ ను ఆదర్శంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా సొంత పార్టీ పెట్టుకుని పదేళ్ల పాటు తిరిగి తిరిగి తన దగ్గర ఏదో ఉందని నమ్మంచి చాన్స్ పొందారు. కానీ కేటీఆర్ మాత్రం… ఇప్పటి వరకూ రాజకీయాల్లో ఎలాంటి కష్టాలు పడలేదు. తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చారు. అప్పట్నుంచి ఇటీవల ఓడిరోయేవరకూ ఆయన అప్రతిహత అధికారమే చూశారు. ప్రతిపక్షాన్ని చూడలేదు. అందుకే ప్రతిపక్షం అంటే ప్రతీ దాన్ని వ్యతిరేకించడమే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా ఆయన తప్పే చూస్తున్నారు. అలా అయితే పర్వాలేదు కానీ తెలంగాణలో ఏం జరిగినా దానికి రేవంత్ రెడ్డి చేతకాని తనమే కారణం అని విమర్శించడానికి వెనుకాడటం లేదు. ఓ హోటల్ లో జరిగిన దేవర సినిమా వేడుక వేడుక ఫెయిల్ కావడానికి కూడా రేవంత్ రెడ్డినే కారణం అనేశారంటే.. కేటీఆర్ ఎంతటి రాజకీయ భావదారిద్ర్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు నమ్ముతారా లేదా అన్నది తర్వాత ముందుగా ఓ నింద రేవంత్ రెడ్డిపై వేయాలన్న ఆలోచనలో ముందూ వెనుకా చూసుకోవడం లేదు. కూల్చివేతల విషయంలో ప్రజాభిప్రాయాల్ని అసలు పరగిణనలోకి తీసుకోకుండా.. సోషల్ మీడియాలో ఒకటే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నిజంగా కూల్చివేతలపై ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకుంటే కేటీఆర్ ఇంతలా సెల్ఫ్ గోల్ చేసుకునేవారు కాదేమో ?
కబ్జాలను సమర్థించడం తెలివిలేని రాజకీయం
హైడ్రా కూల్చివేతలు చేపట్టింది పూర్తిగా కబ్జా స్థలాలు, చెరువుల్లోనే. ప్రైవేటు స్థలాల్లో చిన్న గుడిసె కూడా కూల్చలేదు. వాటిని కూల్చివేయడం వల్ల.. ఆ కబ్జాలు చేసిన వాళ్లు..కబ్జాలు చేసి అమ్మిన వాళ్లు …కొనుక్కున్న వాళ్లే బాధపడతారు.. కానీ బాధ్యత ఉన్న ఎవరూ..ఆ కూల్చివేతలు కరెక్ట్ కాదని వాదించలేరు. గతంలో సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఆక్రమణల గురించి ప్రస్తావించారు. కూల్చివేస్తామని హుంకరించారు. ఎందుకంటే అవి ఆక్రమణలు. ఏ ప్రభుత్వం కూడా వాటిని సమర్థించదు. ఒక వేళ అలా సానుభూతి చూపిస్తే.. రెండు రోజుల్లో తెలంగాణలో ప్రతి ప్రభుత్వ స్థలం..ఫుట్ పాత్లతో సహా ఆక్రమణకు గురవుతుంది. కేటీఆర్ రాజకీయ వ్యూహం ఎంత తేడాగా ఉందంటే మూసి ఆక్రమణల్ని తొలగించడాన్నికూడా వ్యతిరేకిస్తున్నారు. మూసి ఆక్రమణల వల్ల ఎంత నష్టం జరుగుతుందో హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రజలకు తెలుసు. ఆక్రమణలు తీసేసి.. నదిని నదిలా చేస్తే.. ఎంత మేలు జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. దీనికి అడ్డుపడాలనుకుంటున్నారు కేటీఆర్. అదే చేస్తే ఆయనకు కనీస రాజకీయ వ్యూహం లేదని ఎవరైనా అనుకుంటారు.
రేవంత్‌ను తక్కువ అంచనా వేయడం దిద్దుకోలేని తప్పు
రేవంత్ రెడ్డి ఆషామాషీ రాజకీయ నాయకుడు కాదు. ఆయనను చిట్టి నాయుడు అని ఎగతాళి చేయవచ్చు కానీ.. రాజకీయానికి కావాల్సింది శరీర సైజు కాదు. బుర్రలో పాదరసం. అది రేవంత్ రెడ్డి దగ్గర టన్నులకొద్దీ ఉందని… జడ్పీటీసీగా ప్రారంభించి.. స్వల్పకాలంలోనే సీఎం అయిన ఆయన రాజకీయ పయనమే నిరూపిస్తోంది. మళ్లీ ఆయన ఎలాంటి భావోద్వేగ రాజకీయాలు చేయలేదు. పూర్తిగా రాజకీయం చేసే వచ్చారు. అలాంటి ఆయన రాజకీయ వ్యూహాలను అంచనా వేయడంలో తడబడితే.. పాతాళంలోకి తొక్కేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆయన చేసే ప్రతి పనిని వ్యతిరేకించడమే తన ప్రతిపక్ష తనానికి సార్థకత అని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ.. ఎంత తప్పు చేస్తున్నారో ఓ ఏడాది తర్వాత తెలుస్తుంది .కానీ అప్పటికి చేయగలిగిదేమీ ఉండదు .దిద్దుకునే అవకాశం కూడా ఉండదు.
రాజకీయాలు నేర్చుకుంటే వచ్చేవి కాదు. స్వతహాగా చేసుకోవాలి. రంగు, రుచి, వాసన లేని నీళ్లే స్వచ్చమైనవి అని ఎలా చెప్పుకుుంటామో.. ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఎమోషన్లు ఏమీ లేని రాజకీయ వ్యూహాలే ఫలిస్తాయి. తెలుసుకోకరోతే ఇద్దరు యువనేతల రాజకీయం కొన్నాళ్ల తర్వాత ముగిసిపోతుంది.